ChatGPT and AI Tools Ban : ఇకపై ఛాట్ జీపీటీ, డీప్ సీక్ వాడకాన్ని ఆపాలి.. కేంద్ర ప్రభుత్వం..
ABN , Publish Date - Feb 05 , 2025 | 03:28 PM
డేటా భద్రతా సమస్యల కారణంగా ఛాట్ జీపీటీ, డీప్ సీక్ వాడకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌కు ఉద్యోగులు ఇక మీదట దూరంగా ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఛాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని వంటి విదేశీ AI యాప్‌ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ పనిని సులభంగా, వేగంగా పూర్తిచేయడానికి ఈ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించి అందరి మదిలో అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏఐ యాప్స్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్‌ను తప్పక అనుమతించాల్సిందే. ఇది ఏఐ టెక్నాలజీ యాప్స్ వాడేవారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. జాతీయ భద్రత, సున్నితమైన, గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే తమ ఉద్యోగులు ఛాట్ జీపీటీ, డీప్ సీక్ ఇక మీదట వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థికశాఖ.
AI యాప్‌లకు ఇండియాలో పెరుగుతున్న ఆదరణ..
ChatGPT, DeepSeek, Google Gemini వంటి AI యాప్‌లు వల్ల కలిగే ప్రయోజనాల కారణంగా భారతదేశంలో ఈ టెక్నాలజీ వేగంగా ప్రజాదరణ పొందింది. కంటెంట్ సృష్టికి, డేటా విశ్లేషణ, కోడింగ్, భాషా అనువాదం, ఇతర పనులలో వినియోగదారులకు ఎంతో సహాయపడుతోంది ఏఐ. అందుకే విద్యార్థులు, నిపుణులు, వ్యాపారవేత్తలలో ఈ యాప్‌ల వాడకం వేగంగా పెరుగుతోంది.
ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ..
అధికారిక పనుల కోసం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై AI సాధనాలను ఉపయోగించటం మానుకోవాలని ఆపాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించినట్లు పలు జాతీయ మీడియా కథానాలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వం సొంత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. అందుకు సంబంధించి సమగ్ర విధానాన్ని రూపొందించే ప్రక్రియ కూడా మొదలైంది. ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు చైనాకు చెందిన డీప్ సీక్ వాడకంపై నిషేధాజ్ఞలు జారీ చేశాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వాడుతున్న ఏఐ యాప్‌లు డేటా భద్రతకు, గోప్యతకు భంగం కలిగించవచ్చనే భయాందోళనే అందుకు ప్రధాన కారణం.
భారతదేశంలో ఓపెన్ ఏఐ చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. అనేక దిగ్గజ మీడియా సంస్థలు OpenAI కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసులు దాఖలు చేశాయి. R క్రమంలోనే భారత ప్రభుత్వం ఏఐ వాడకంపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకోవడపై సాంకేతిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. AI సాధనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ డేటా గోప్యత, సైబర్ భద్రతకు సంబంధించిన కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రపంచదేశాలతో పోటీపడాలంటే స్వదేశీ AI పరిజ్ఞానంతో సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..