Share News

Delhi Blast Investigation: షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి భార్యతో సంబంధాలు!

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:49 PM

ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన డాక్టర్ షాహీన్ సయీద్ కు పుల్వామా ఘటన సూత్రదారి భార్యతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

 Delhi Blast Investigation: షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి భార్యతో సంబంధాలు!
Delhi Blast

దేశ రాజధాని నగరం ఢిల్లీ పేలుడు(Delhi Blast) ఘటన, అలానే పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో జైష్ ఏ మహ్మద్ సంస్థకు ఉన్న సంబంధాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు సంచలన విషయం ఒకటి తెలిసింది. జైష్ కమాండర్, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో, ఉగ్రవాద అనుమానితురాలిగా అరెస్టైన డాక్టర్ షాహీన్ సయీద్‌( Dr Shaheen Sayeed)కు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి తర్వాత జైష్ చీప్ మసూద్ అజర్ మేనల్లుడు ఉమర్ ఫరూఖ్ ఎన్ కౌంటర్ లో మరణించాడు. అతడి భార్యనే అఫిరా బీబీ(Afira Bibi).


జైషే ఏ మహ్మద్(Jaish e Mohammad) ఇటీవల తన ఉగ్ర ప్రణాళికలను మార్చుకుంటుంది. కొత్తగా మహిళా జీహాదీలను తయారు చేసేందుకు సిద్ధమైందని అధికారుల విచారణలో తేలింది. మహిళా ఉగ్రవాదుల కోసం ‘జమాల్ అల్ మోమినాత్’ను ప్రారంభించిందని, ఢిల్లీ పేలుడుకు కొన్ని వారాల ముందు అఫిరా ఈ జిహాదీ గ్రూప్ సలహా మండి షురాలో చేరారని భద్రతా సంస్థల దర్యాప్తులో వెల్లడైంది. జైష్ ఏ మహ్మద్ చీప మసూద్ అజర్ చెల్లెలు సాదియా అజర్‌తో కలిసి అఫిరా బీబీ పనిచేస్తోంది. వీరిద్దరు కూడా ఢిల్లీ పేలుడు(Delhi Blast) కుట్రతో సంబంధం ఉన్న షాహీన్ సయీద్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.


ఫరీదాబాద్‌లోని అల్-ఫలా విశ్వవిద్యాలయంలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న షహీన్ సయీద్ కారులో అస్సాల్ట్ రైఫిల్స్, ఇతర మందుగుండు సామగ్రి దొరడంతో ఆమెను అరెస్టు చేశారు. జమాత్-ఉల్-మోమినాత్ భారత విభాగాన్ని ఏర్పాటు చేయడం, ఉగ్రవాద కార్యకలాపాల కోసం తీవ్రవాద మహిళలను నియమించడం వంటి బాధ్యతలను షాహీన్ సయీద్‌( Dr Shaheen Sayeed)కు అప్పగించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. లక్నోకు చెందిన షాహీన్ సయీద్, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు అనేక మెడికల్ కాలేజీల్లో పనిచేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం.. ఆమె సెప్టెంబర్ 2012 నుండి డిసెంబర్ 2013 వరకు కాన్పూర్‌లోని ఒక వైద్య కళాశాలలో ఫార్మకాలజీ విభాగాధిపతిగా పనిచేశారు. ఆమె పాస్‌పోర్ట్ వివరాల ప్రకారం ఆమె 2016 నుండి 2018 వరకు రెండేళ్లు యుఎఇలో నివసించినట్లు వెల్లడైంది.


ఇవీ చదవండి:

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 07:38 PM