Bihar Election Results: బిహార్ ఎన్నికలు.. రేపే ఓట్ల కౌంటింగ్.. ప్రజాతీర్పుపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:45 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ను రేపు నిర్వహించనున్నారు. ఎన్డీయే, మహాగఠ్‌బంధన్‌లల్లో విజయం ఎవరిని వరిస్తుందో రేపు తేలిపోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఎన్డీయే కూటమిదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేదా? అనేది రేపటితో తేలిపోతుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి రికార్డు నెలకొల్పిన నితీశ్ కుమార్ ఈసారి గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించిన వారవుతారు (Bihar Counting of Votes).
రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ఇటీవల తెలిపింది. కౌంటింగ్ సెంటర్లలో రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తరువాత రాష్ట్ర పోలీసు బలగాలతో పహారాను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 24/7 సీసీటీవీ నిఘా కూడా ఉంటుందని వెల్లడించింది. ఇక ఓట్లు భద్రపరిచిన ప్రతి స్ట్రాంగ్ రూమ్ క్యాంపస్ వద్ద జిల్లా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు స్ట్రాంగ్ రూమ్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది (Election Commission).
ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో 67.13 శాతం మేర పోలింగ్ జరిగింది. దీంతో, ప్రజాతీర్పుపై ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూటమి నేత తేజస్వీ యాదవ్ మాత్రం ఈ అంచనాలను కొట్టిపారేశారు. తమ కూటమి మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీ(యూ), బీజేపీతో సహా ఎన్డీయే (NDA) కూటమిలోని ఐదు పార్టీలు బరిలో నిలిచాయి. జేడీ(యూ), బీజేపీలు 101 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక ఆర్‌జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎమ్ఎల్) లిబరేషన్, ఇతర లెఫ్ట్ పార్టీలు, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీలు మహాగఠ్‌బంధన్‌గా (మహాకూటమి) (Mahagathbandhan) ఏర్పడి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
ఇవీ చదవండి:
గ్రెనేడ్ దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి