BJP Targets Karnataka Congress with AI Video: కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:16 PM
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్‌ల క్యారికేచర్లతో కృత్రిమ మేథస్సును ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో 26 సెకన్ల పాటు ఉంది. ఇందులో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కలిసి డీకే శివకుమార్‌కు 'హాయ్' అంటూ వాట్సాప్ మెసేజ్ పంపుతారు.
బెంగళూరు: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ (BJP) ఒక వ్యంగ్య వీడియో క్లిప్‌ను ఆదివారంనాడు విడుదల చేసింది. కర్ణాటకలో నాయకత్వ మార్పిడి జరగనుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మధ్య పోరు నెలకొందని కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ఈ వీడియోను సంధించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్‌ల క్యారికేచర్లతో కృత్రిమ మేథస్సు (AI)ను ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో 26 సెకన్ల పాటు ఉంది. ఇందులో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కలిసి డీకే శివకుమార్‌కు 'హాయ్' అంటూ వాట్సాప్ మెసేజ్ పంపుతారు. రాహుల్ గాంధీ అకౌంట్ నుంచి ఈ మెసేజ్ వెళ్తుంది. ఆ వెంటనే ఒక స్క్రాచ్ కార్డు ప్రత్యక్షమవుతుంది. ఎంతో ఆసక్తిగా ఆ కార్డును డీకే శివకుమార్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ తింటారు. 'నో చైర్ నవంబర్' అని అందులో కనిపించడమే అందుకు కారణం. ఆ వెంటనే రాహుల్, సిద్ధరామయ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. కెమెరా ముందు ఒక హస్కీ డాన్సింగ్‌తో వీడియో ముగుస్తుంది. డీకే శివకుమార్‌కు 'నవంబర్‌లో కూర్చీ ఉండదు' అనే చెబుతూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ వీడియోను బీజేపీ షేర్ చేసింది. 'కాంగ్రెస్ ఫెయిల్స్ కర్ణాటక', 'సీఎం చైర్ ఫేట్' అనే హ్యాష్‌ట్యాగ్‌లు కూడా చేర్చింది.
సీఎం కుర్చీపై ఊహాగానాలు..
కర్ణాటక రాజకీయాల్లో కొద్ది కాలంగా ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి మార్పు జరుగనుందనే ఊహాగానాలు వెలువడుతున్నారు. ఇద్దరి నేతల మధ్యా సీఎం సీటును రెండున్నరేళ్లు చొప్పున పంచుకునే ఒక ఒప్పందం ఉందని కొందరు చెబుతుంటే, దానిని 'నవంబర్ రివల్యూషన్'గా మరికొందరు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలకు సిద్ధరామయ్య, శివకుమార్ కొట్టేస్తున్నారు. తాను క్రమశిక్షణ కలిగిన నాయకుడినని, తానూ, సిద్ధరామయ్య పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శివకుమార్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై తమ మధ్య ఎలాంటి చర్చలు చోటుచేసుకోలేదని, పార్టీ నేతలను కలిసే ఆలోచన కూడా తనకు లేదని చెప్పారు. సిద్ధరామయ్య సైతం ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానని, అయితే ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇటీవల తెలిపారు. కర్ణాటక మంత్రి జమీర్ అమ్మద్ ఖాన్ ఇదే విషయంపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కావాలనే కోరిక శివకుమార్‌కు ఉందని, 2028లో సిద్ధరామయ్య ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాతే సీఎం కావాలని ఆయన అభిలషిస్తున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్ అరెస్ట్.. త్వరలో విదేశాల నుంచి ఇండియాకు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి