Donald Trump hosts Asim Munir: ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన పాక్..!
ABN , Publish Date - Jun 21 , 2025 | 09:04 AM
Trump lunch with Pakistan Army Chief: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య వైట్ హౌస్ లో జరిగిన భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యాహ్న విందు తర్వాత ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ దాయాది దేశం ప్రతిపాదించింది.

Pakistan nominates Trump for Nobel Peace Prize: పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. పహల్గాం దాడి అనంతరం భారత్-పాక్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ పాత్రను ప్రశంసిస్తూ ఈ ప్రతిపాదన చేసింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగకుండా అగ్రరాజ్య అధ్యక్షుడు చొరవ తీసుకుని నివారించారని దాయాది దేశం పేర్కొంది. వాస్తవానికి, గతంలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తనను వైట్ హౌస్‌కు ఆహ్వానిస్తే.. ట్రంప్ పేరును 2026 నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అన్నట్టుగానే తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు కనిపిస్తోంది.
'ఇటీవల భారతదేశం-పాకిస్థాన్ సంక్షోభ సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేసి శాంతి నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. 2026 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమ ప్రభుత్వం సిఫార్సు చేయాలని నిర్ణయించాం' అని పాకిస్థాన్ ప్రభుత్వం తన అధికారిక X ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది.
వైట్ హౌస్‌లో ట్రంప్, మునీర్ భేటీ
జూన్ 18న వైట్ హౌస్‌లో ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మధ్య జరిగిన భేటీ తర్వాత ఈ నామినేషన్ ప్రతిపాదన రావడం విశేషం. ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని మునీర్ సిఫార్సు చేసిన తర్వాత ఈ సమావేశం జరిగిందని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధృవీకరించారు. అంటే, అధ్యక్షుడు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని పాకిస్థాన్ హామీ ఇవ్వడం వల్లే.. వైట్ హౌస్‌కు ఆయనను ఆహ్వానించామని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో, ట్రంప్, ' అణ్వాయుధ దేశాలైన భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని నేనే నిరోధించాను.' అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల జీ-7 సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్ కు కాల్ చేసి కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందమేనని తేల్చి చెప్పారు. అనంతరం, ట్రంప్ కూడా ఇందులో నా ప్రమేయం లేదని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ట్రంప్‌కు నోబెల్ పై చెలరేగిన వివాదం..
ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రతిపాదించడంతో ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతి ప్రదాన ప్రక్రియపై చర్చ మొదలైంది. నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం, జాతీయ పార్లమెంటేరియన్లు, ప్రభుత్వ సభ్యులు లేదా గత నోబెల్ గ్రహీతలు వంటి విశిష్ట వ్యక్తులు మాత్రమే నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం పనిచేస్తున్న పాక్ సైనిక అధికారిగా ఉన్న అసిమ్ మునీర్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేరు. దీని వలన అతడి నామినేషన్ పూర్తిగా చెల్లనట్లేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదిస్తే కచ్చితంగా ఆ నామినేషన్ చెల్లుబాటు అవుతుంది. ఇకపోతే, నోబెల్ కమిటీ నామినేషన్లను నిర్ధారించదు. ఈ రికార్డులు 50 సంవత్సరాల పాటు గోప్యంగా ఉంచబడతాయి.
ఇవీ చదవండి:
Israel Iran War: 9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి