Cambodia: థాయ్–కంబోడియా మధ్య ఉద్రిక్తతలు.. అడ్వైజరీ జారీ చేసిన భారత్..!
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:07 PM
Travel Advisory: కంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత దౌత్య కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కంబోడియాలో నివసిస్తున్న భారతీయులు, కంబోడియాను సందర్శించాలనుకునే వారూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Travel Advisory For Indians: కంబోడియా, థాయిలాండ్ మధ్య రాజుకున్న సరిహద్దు ఉద్రిక్తతలు (Thailand Cambodia War) యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరుదేశాలు పరస్పర దాడులు కొనసాగిస్తున్న దృష్ట్యా భారత దౌత్య కార్యాలయం భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కంబోడియాలో నివసిస్తున్న భారతీయులు, కంబోడియాను సందర్శించాలనుకునే వారూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కంబోడియాలోని మతపరమైన, పర్యాటక ప్రదేశాలను సందర్శనకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ థాయిలాండ్-కంబోడియా సరిహద్దులో ఉన్న నగరాలకు ప్రయాణించకూడదని స్పష్టం చేసింది. కంబోడియాలోని భారతీయులు నిరసనలు, జనసమూహాలకు దూరంగా ఉండాలని.. హింసాత్మకంగా మారే అవకాశముందని అడ్వైజరీలో పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం
థాయ్-కంబోడియా ఘర్షణలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కంబోడియా, థాయిలాండ్ రెండూ UN సంస్థకు అధికారికంగా ఫిర్యాదులను సమర్పించాయి. థాయ్ దళాలు తమ భూభాగంలోకి ప్రవేశించి వివాదాస్పద ఆలయ స్థలాలకు సమీపంలో దాడులు ప్రారంభించి ముందస్తు ఒప్పందాన్ని ఉల్లంఘించాయని కంబోడియా ఆరోపించింది. దీనికి విరుద్ధంగా కంబోడియా సరిహద్దులో శత్రుత్వాన్ని ప్రారంభించిందని, మందుపాతరలను వేస్తోందని థాయిలాండ్ ఆరోపించింది. అయితే, తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కోసం కంబోడియా పిలుపునివ్వగా.. బ్యాంకాక్ చర్చలకు సమ్మతించినట్లు ఐక్యరాజ్యసమితిలోని కంబోడియా రాయబారి ఛియా కియో వెల్లడించారు.
థాయ్‌లాండ్ భూభాగంలో మందుపాతర పేలడంతో సరిహద్దుల వద్ద వివాదం రాజుకుంది. ఇది ఇరుదేశాల మధ్య 2 రోజుల పాటు తీవ్ర సైనిక ఘర్షణలకు దారితీసింది. థాయిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, థాయ్ సరిహద్దు ప్రాంతాల నుండి 130,000 మందికి పైగా ప్రజలను తరలించినట్లు సమాచారం. రెండు దేశాలు రాయబారులను వెనక్కి పిలిపించాయి. అనేక కీలక సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసాయి. ఈ ఘర్షణలో 14 మంది థాయ్ వాసులు మృతిచెందగా.. కంబోడియాలో ఒకరు మరణించారు. కాగా, థాయ్-కంబోడియా వివాదం అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు దేశాలు వెంటనే శాంతించాలని సూచించాయి.
ఇవి కూడా చదవండి:
వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు
హమాస్‌పై మండిపడ్డ ట్రంప్.. వారి పని ముగించేయాలంటూ ఇజ్రాయెల్‌కు సూచన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి