Share News

Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:32 AM

కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని రాష్ట్రపతి, ప్రధాని అమర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. ఇక త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు

Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
Kargil Vijay Diwas

ఇంటర్నెట్ డెస్క్: కార్గిల్ విజయ్ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నాటి యుద్ధంలో పాక్‌పై విజయం కోసం జవానులు చేసిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్‌లకు నివాళులు అర్పించారు.

మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్‌లకు తాను నివాళులు అర్పిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ సైనికుల ధైర్యసాహసాలు, సడలని పట్టుదలకు ఈ రోజు చిహ్నమని వ్యాఖ్యానించారు. వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత మాత బిడ్డల ధైర్యసాహసాలు, త్యాగాలను ఈ రోజు గుర్తుకు తెస్తోందని అన్నారు. భారత్ సగర్వంగా తలెత్తుకునేలా జవాన్‌లు తమ జీవితాలను అంకితం చేశారని వ్యాఖ్యానించారు.


1999లో పాక్‌పై యుద్ధంలో విజయాన్ని, అమర జవానుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏటా జులై 26న భారత్‌లో కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 1999 మేలో పాక్ సైనికులు ఉగ్రవాదుల వేషాల్లో భారత్‌లోకి చొరబడ్డారు. కార్గిల్ ప్రాంతంలోని ఎత్తైన భూభాగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పాక్ ఆట కట్టించేందుకు భారత్ ఆపరేషన్ విజయ్‌ను ప్రారంభించింది. కఠిన వాతావరణ పరిస్థితులకు ఎదురు నిలిచిన భారత జవాన్లు అద్భుత పోరాట పటిమతో పాక్ సైనికులను తరిమి కొట్టి భారత్ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు రెండు నెలల పాటు ఈ ఆపరేషన్ సాగింది. విజయం సాధించామని భారత్ జులై 26న అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ ఆపరేషన్ సందర్భంగా 527 మంది సైనికులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు.


ఇవి కూడా చదవండి:

మాజీ ఉపరాష్ట్రపతికి టైప్ 8 బంగళా కేటాయించిన కేంద్రం.. అసలు ఇదేంటంటే..

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 26 , 2025 | 12:05 PM