US Ilegal Indian Immigrants : 205 మంది వలసదారులతో.. టెక్సాస్ నుంచి భారత్‌కు బయల్దేరిన విమానం..
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:21 AM
అక్రమంగా యూఎస్‌లో నివసిస్తున్న భారతీయులను గుర్తించి స్వదేశానికి తరలిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. 205 మందితో కూడిన ఓ విమానం టెక్సాస్ నుంచి స్వదేశానికి బయలుదేరినట్లు సమాచారం.

అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అక్రమవలసదారుల విషయంలో కఠినంగా వైఖరితో ముందుకెళ్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పదవీ బాధ్యతలు స్వీకరించి నెల కూడా పూర్తి కాక మునుపే వలసదారులను గుర్తించి స్వదేశాలకు తరలిస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగానే ఇవాళ కొంతమంది భారత వలసదారులను అమెరికా నుంచి వెనక్కి పంపిస్తున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, కొన్ని గంటల కిందటే బయల్దేరిన విమానంలో 205 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.
అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశానికి పంపించాలని కంకణం కట్టుకుంది ట్రంప్ ప్రభుత్వం. ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మొత్తం 18 వేల మంది భారతీయుల అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించింది. వీరిలో 205 మంది సి-17 మిలిటరీ యుద్ధ విమానంలో వెనక్కి పంపిస్తోంది. అమెరికాలోని అక్రమ భారతీయ వలసదారులను తిరిగి తీసుకువచ్చే విమానాలలో ఇది మొదటిదని సమాచారం. కొన్ని గంటల క్రితమే ఈ విమానం టెక్సాస్ నుంచి భారతదేశానికి బయల్దేరి వస్తున్నట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. సుమారు 24 గంటల తర్వాత వీరంతా స్వదేశంలో అడుగుపెడతారని అంచనా.
అమెరికా సైనిక విమానం సి-17 ద్వారా 205 భారతీయ వలసదారులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. బహిష్కరించబడిన ప్రతి భారతీయ జాతీయుడి గురించి న్యూ ఢిల్లీకి సమాచారం ఇచ్చి ధృవీకరించుకున్నాకే ఈ ప్రకియ మొదలుపెట్టామని యూఎస్ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయ పౌరులు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా నివసించేందుకు తాము వ్యతిరేకమని, సరైన పత్రాలు లేకుండా ఏ దేశంలో ఉన్నా వెనక్కి పిలిపించుకునేందుకు తాము సిద్ధమని భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ముందుగా పంచుకున్నాకే ఈ ప్రక్రియకు అనుమతిస్తామని వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే వారం అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే ఆయన తొలి పర్యటన. ఈ వార్తల నేపథ్యంలోనే అక్రమ భారతీయ పౌరులను తొలి విడత బహిష్కరించే ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా సహా విదేశాలలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న భారతీయ పౌరులు చట్టబద్ధమైన రీతిలో వెనక్కి పంపినా తమకు అభ్యంతరం లేదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గతంలో అన్నారు.