Diabetes Risk: మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారా? ఈ సమస్యలు తప్పవు.. సైంటిస్టుల సర్వేలో షాకింగ్ నిజాలు...!
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:53 PM
Mental Health and Diabetes Link: డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేము కానీ.. డబ్బులు తీసుకుని అనారోగ్యాన్ని మాత్రం ఎంచక్కా తెచ్చేసుకోవచ్చు. ఎలాగంటారా.. ఆఫీసుకెళ్తే చాలు. పని ఒత్తిడితో ఎక్కడెక్కడి రోగాలన్నీ ఒంటబట్టించుకోవచ్చు. ఈ మాట చెబుతున్నది తాజా అధ్యయనాలే..

Diabetes Risk Due to Work Stress: ఉద్యోగం వచ్చేవరకూ సంపాదనలేదని కుటుంబం, సమాజం నుంచి ఒత్తిడి. నానా అగచాట్లు పడి ఏదొక జాబ్ సంపాదించారనే అనుకోండి. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. పుట్టినప్పటి నుంచి ఉద్యోగంలో చేరేవరకూ జీవితంలో ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కలిగి ఉండదు. నిత్యం టార్గెట్ల వెంట పరిగెడుతూ ఒకటొకటిగా ఛేదిస్తూ వెళుతున్నా.. ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతూనే ఉంటాయి. నూటికి తొంభై మంది ఈ వలయంలో చిక్కుకుని.. ఒత్తిడి భారం తమపై ఉందని తెలియకుండానే రోజులో సగానికంటే ఎక్కువ సమయాన్ని తమ యాజమాన్యాల కోసం అంకితం చేస్తున్నారు. తిండి, నీరు, కుటుంబం అన్నీ మర్చిపోయి ఇంత కష్టపడినందుకు ప్రతిఫలంగా నెల తిరక్కుండానే జీతం బ్యాంక్ అకౌంట్లో పడచ్చొమో గానీ.. సంతృప్తి, సంతోషం, వెలకట్టలేని ఆరోగ్యం మాత్రం హరించుకుపోతున్నాయి. ఇప్పుడిదే విషయాన్ని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆఫీసుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి, సహోద్యోగులతో వ్యక్తిగత ఘర్షణలు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 20-24 శాతం పెంచుతున్నట్లు చెబుతున్నాయి. దీంతో పాటు బీపీ, అసిడిటీ, మానసిక సమస్యలు వంటివి బోనస్.
టాక్సిక్ ఎన్విరాన్‌మెంట్లో పనిచేసే ఉద్యోగుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం 24 శాతం పెరుగుతుందని ఇటీవలి అధ్యయనం తేల్చింది. భావోద్వేగాలను దెబ్బతీసేలా ఆఫీసు వాతావరణం ఉంటే.. అక్కడి ఉద్యోగుల్లో జీవక్రియ రుగ్మతల ప్రమాదం 47 శాతం ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ జర్నల్‌లో ఈ అధ్యయానికి సంబంధించిన నివేదిక ప్రచురించబడింది. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు ఈ పరిశోధన చేశారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 2005లో స్వీడన్‌లో సుమారు 30 లక్షల మంది వ్యక్తుల డేటాను పరిశీలించారు. అందరూ 30-60 సంవత్సరాల వయస్సు గలవారు. వారికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. డయాబెటిస్ అప్పటికే ఉందా? లేదంటే అప్పటికే ఏదైనా మెడికల్ హిస్టరీ ఉందా అనే కోణంలో టెస్ట్ చేశారు. కొన్నేళ్ల తర్వాత ఆయా వ్యక్తుల రిపోర్ట్స్ పరిశీలించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. 2006- 2020 మధ్య ఏకంగా రెండు లక్షల మందికి పైగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వీరిలో దాదాపు 60 శాతం మంది పురుషులే. భావోద్వేగ డిమాండ్లు, ఘర్షణ వాతావరణంలో ఏళ్ల తరబడి పనిచేయడం వల్ల పురుషులలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 15-20 శాతానికి పెరగగా.. మహిళల్లో 20- 24 శాతానికి పెరిగినట్లు పరిశోధకులు తేల్చారు.
ఉద్యోగ ఒత్తిడి, అభద్రత, హింస లేదా కార్యాలయంలో బెదిరింపు వంటి అంశాలు డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయని పరిశోధకులు తెలిపారు. ఎండోక్రైన్ వ్యవస్థను (హార్మోన్లను ఉత్పత్తి చేసే) ప్రభావితం చేసే దీర్ఘకాలిక లేదా నిరంతర ఒత్తిడి స్థాయిలు.. ఒత్తిడి హార్మోన్ 'కార్టిసాల్' అధిక ఉత్పత్తికి, ఇన్సులిన్ నిరోధకత పెరుగుదలకు కారణమవుతాయని వారు తెలిపారు. అయితే, రోగులు, కస్టమర్లు, క్లయింట్లు లేదా ప్రయాణీకులతో వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యే ఉద్యోగాలు చేసేవారిలో ఈ సమస్య ఏ మేరకు ఉందనేది ఇంకా కచ్చితంగా తెలియదు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..
పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?
For More Health News