Share News

Monsoon Diet: వర్షాకాలంలో ఈ పదార్థాలు తింటే పేగు ఆరోగ్యానికి ముప్పు..!

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:58 PM

అధిక తేమ కారణంగా వర్షాకాలంలో కూరగాయలు, పండ్లు లేదా నిల్వ చేసిన ఆహారాల్లో పరాన్న జీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ సీజన్లో కింది పదార్థాలను పూర్తిగా నివారించాలి. లేకపోతే కీళ్ల నొప్పులతో పాటు జీర్ణాశయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

Monsoon Diet: వర్షాకాలంలో ఈ పదార్థాలు తింటే పేగు ఆరోగ్యానికి ముప్పు..!
Vegetables to Avoid During Monsoon

వానాకాలం ఆహ్లాదకర వాతావరణంతో పాటు అనారోగ్యాలను మోసుకొస్తుంది. ఈ సీజన్లో పర్యావరణంలో తేమ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు లేదా నిల్వ చేసిన ఆహారాల్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా పరాన్న జీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ సీజన్లో కింది పదార్థాలను పూర్తిగా నివారించాలి. లేకపోతే కీళ్ల నొప్పులతో పాటు జీర్ణాశయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు, మెదడు ఆరోగ్యం ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది.


వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు

స్ట్రీట్ ఫుడ్

సాయంత్రం వేళల్లో వేడి వేడిగా స్ట్రీట్ ఫుడ్ తినడం ఉత్సాహం కలిగించవచ్చు. కానీ, వర్షం పడుతున్నప్పుడు వీధి ఆహారం తినకుండా ఉండటమే మంచిది. అపరిశుభ్రమైన పరిస్థితులు ప్రభావం వల్ల వీధి వ్యాపారులు అమ్మే ఆహారం కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాంటి భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణశయ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఆకు కూరలు

ఆకుకూరలు సాధారణంగా ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వర్షాకాలంలో వాటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షపు నీటి వల్ల వీటిపై కాలుష్య కారకాలు, మలినాలు చేరవచ్చు. ఇలాంటి ఆకుకూరలను తింటే ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, వంకాయ, సొరకాయ, బెండకాయ, పుట్టగొడుగులను ఎట్టి పరిస్థితుల్లో తినకండి. ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా శుభ్రం చేసి ఉడికించిన ఆకుకూరలు, కూరగాయలనే తినండి.


సలాడ్లు

చాలా మందికి పాలకూర, దోసకాయ లేదా మొలకలు వంటి పదార్థాలతో చేసిన సలాడ్‌లు అంటే చాలా ఇష్టం. అయితే, వర్షాకాలంలో సలాడ్‌లను నివారించడం మంచిది. ఎందుకంటే వాటిలో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు లేదా తేమతో కూడిన వాతావరణాన్ని ఇష్టపడే పరాన్నజీవులు ఉండవచ్చు. బదులుగా ఉడికించిన కూరగాయలను ఎంచుకోండి.

ఫ్రై ఫుడ్స్

వర్షాకాలంలో వేడి వేడి పకోడాలు, సమోసాలు వంటివి ఎక్కువగా తినాలని అందరికీ అనిపిస్తుంది. అయితే, నూనెలో వేయించిన ఈ ఆహారాలు అంత సులువుగా జీర్ణం కావు. అధిక నూనె కంటెంట్ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

సీఫుడ్

వర్షాకాలంలో సీఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. ఈ సీజన్లో కాలుష్యం కారణంగా నీళ్లలో జీవించే జీవులకు ప్రమాదకరమైన క్రిములు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు గట్ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.


కట్ ఫ్రూట్స్

వర్షాకాలంలో ముందుగా కోసిన పండ్లు, పాశ్చరైజ్ చేయని పండ్ల రసాలను పూర్తిగా నివారించాలి. ఈ ఆహారాలను నిల్వ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బదులుగా తాజాగా ఉన్న పండ్లనే స్వయంగా తినండి.

పాల ఉత్పత్తులు

వర్షాకాలంలో పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులను జాగ్రత్తగా తీసుకోవాలి. గాలిలో తేమ బ్యాక్టీరియా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది పాల ఉత్పత్తులు చెడిపోవడానికి కారణమవుతుంది. గడువు తేదీలకు ముందే తీసుకునేలా చూసుకోండి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


ఇవి కూడా చదవండి:

న్యూరోసర్జన్ల హెచ్చరిక.. ఈ ఫుడ్స్ తింటే మీ బ్రెయిన్ ఖతం

ఇలాంటి అలవాట్లు కూడా బ్రెయిన్‎కు డేంజరని తెలుసా

Read Latest and Health News

Updated Date - Jul 29 , 2025 | 12:59 PM