Coal Missing: 4 వేల టన్నుల బొగ్గు వానలో కొట్టుకుపోయిందా.. మంత్రి వ్యాఖ్యలు వైరల్
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:08 PM
గతంలో బంగారం, వెండి సహా అనేక రకాల వస్తువులు మాయం కావడం గురించి విన్నాం. కానీ వేల టన్నుల బొగ్గు మాయమైన సంఘటన గురించి తెలుసా. ఇక్కడ తెలుసుకుందాం పదండి.

మేఘాలయలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 4,000 మెట్రిక్ టన్నుల బొగ్గు రహస్యంగా మాయమైంది (Meghalaya coal missing). ఈ విషయంపై మేఘాలయ కేబినెట్ మంత్రి కిర్మెన్ షిల్లా ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బొగ్గు వర్షాల కారణంగా కొట్టుకుపోయి, పొరుగు రాష్ట్రమైన అస్సాంతో పాటు బంగ్లాదేశ్‌కు చేరి ఉండవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బొగ్గు ఎక్కడ మాయమైంది?
మేఘాలయ సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని రానికోర్ బ్లాక్‌లో రాజాజు, డీంగ్‌న్గన్ గ్రామాల్లోని డిపోలలో ఈ బొగ్గును నిల్వ చేశారు. ఈ బొగ్గు అధికారికంగా సర్వే చేసి, రికార్డు చేశారు. అయితే, జస్టిస్ (రిటైర్డ్) బీపీ కటాకీ నేతృత్వంలోని కమిటీ తాజా మధ్యంతర నివేదిక ప్రకారం 4,000 మెట్రిక్ టన్నుల బొగ్గు పూర్తిగా అదృశ్యమైంది. మేఘాలయలో బొగ్గు తవ్వకం, రవాణాను పర్యవేక్షించే బాధ్యత ఈ కమిటీకి ఉంది. దీంతో ఇంత పెద్ద మొత్తంలో బొగ్గు ఎలా మాయమైందనే ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఎలా కొట్టుకుపోతుంది..?
మేఘాలయలో సాధారణంగా దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ భారీ వర్షాల వల్ల ఏదైనా జరగవచ్చు. ఈస్ట్ జైంతియా హిల్స్ నుంచి వర్షపు నీరు బంగ్లాదేశ్, అస్సాంకు ప్రవహిస్తుంది. బహుశా ఈ వర్షాల కారణంగా బొగ్గు కొట్టుకుపోయి ఉండవచ్చని మంత్రి కిర్మెన్ షిల్లా షిల్లాంగ్‌లో అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వర్షంలో అంత బొగ్గు ఎలా కొట్టుకుపోతుందని ప్రశ్నిస్తూ మీమ్స్ చేస్తున్నారు.
లేదంటే కుట్ర ఉందా?
మంత్రి షిల్లా తన వాదనలో వర్షాలు మాత్రమే కారణం అని చెప్పలేదు. అక్రమ రవాణా జరిగిందని చెప్పడానికి ఎలాంటి వివరాలు లేవన్నారు. ఈ క్రమంలో అధికారులుగా అక్రమ తవ్వకం, రవాణా జరగకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మేఘాలయ హైకోర్టు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భారీ బొగ్గు రాసి అక్రమంగా తరలించడానికి బాధ్యులైన వ్యక్తులు, అధికారులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివాదాస్పద చరిత్ర
మేఘాలయలో బొగ్గు తవ్వకం చాలా కాలంగా వివాదాస్పదం. 2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) బొగ్గు తవ్వకంపై నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. Xలో కొందరు యూజర్లు ఈ ఘటనను అక్రమ బొగ్గు మాఫియాతో ముడిపెట్టారు. రాజకీయ నాయకులు, అధికారుల కుమ్మక్కుతో ఈ బొగ్గు తరలించబడి ఉండవచ్చని ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి