Sugarcane Juice: చెరకు రసం ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలుసా..
ABN , Publish Date - Apr 26 , 2025 | 10:21 AM
Sugarcane Juice Storage: అలసిన శరీరానికి తియ్యటి, కమ్మటి చెరకు రసం కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే, మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. అందువల్ల నిల్వ చేసినవి అమ్మేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ తాగొచ్చులే ఇళ్లలోనూ ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇంతకీ, చెరకు రసాన్ని ఎంత కాలం నిల్వ ఉంచవచ్చో మీకు తెలుసా.. చెరకు రసం గురించి తక్కువ మందికే తెలిసిన 9 ముఖ్యమైన విషయాలు మీకోసం..

Sugarcane Juice Shelf Life: వేసవిలో అందరూ అమితంగా ఇష్టపడే ఆరోగ్యకరమైన పానీయాలలో చెరకు రసం ఒకటి. ఇది శరీరాన్నివెంటనే చల్లబరచి ఉత్సాహాన్ని నింపుతుంది. అంతేకాకుండా హైడ్రేటెడ్‌గా ఉంచే, శక్తినిచ్చే అనేక పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. కానీ, చెరకు రసం వెంటనే తాగమని ఎందుకు చెబుతారో మీకు తెలుసా? దానిని ఎందుకు నిల్వ చేయరు? అది చెడిపోవడానికి ఎంత సమయం పడుతుంది? చెరకు రసం గురించి తక్కువ మందికే తెలిసిన వాస్తవాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో..
చెరకు రసం తాజాగానే తాగాలా?
చెరకు రసం తీసిన వెంటనే దానిలో ఆక్సిడేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే దాని రుచి, రంగు, పోషకాలు వేగంగా మారడం ప్రారంభిస్తాయి. కాబట్టి, తాజాగా తాగడం మంచిది.
చెడిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
చెరకు రసం 15 నుంచి 20 నిమిషాల్లోనే రంగు మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వేసవిలో గంటలోనే చెడిపోతుంది. అందుకే దీన్ని తయారు చేసి వెంటనే తాగాలి.
ఎందుకు నిల్వ చేయరు?
చెరకు రసంలో సహజ చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వేగంగా పెరిగేందుకు అనువైన పదార్థం. మీరు నిల్వ చేయడానికి ప్రయత్నించినా అది త్వరగా పులిసి పుల్లగా లేదా విషపూరితంగా మారుతుంది.
ఫ్రిజ్‌లో ఉంచవచ్చా?
కాసేపు ఆగి తాగాలి అని భావిస్తే చెరకు రసాన్ని 30-40 నిమిషాలకు మించి ఫ్రిజ్‌లో ఉంచకండి. ఆ సమయానికే రుచి చెడిపోయి పోషకాలు తగ్గిపోవచ్చు. కానీ, హానికరం కాదు.
త్వరగా ఆక్సీకరణం చెందడానికి కారణం?
చెరకు రసంలో ఉండే ఎంజైమ్‌లు, చక్కెర వాతావరణంతో అనుసంధానం అయిన వెంటనే ఆక్సిజన్‌తో చర్య జరుపుతాయి. దీని కారణంగా దాని రంగు గోధుమ రంగులోకి మారడం మొదలవుతుంది.
ఐస్ వేయడం మంచిదేనా?
చెరకు రసానికి ఐస్ జోడించడం వల్ల చల్లగా ఉండి ఆక్సిడేషన్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. కానీ అది పరిమిత కాలం వరకు మాత్రమే సురక్షితంగా ఉంటుంది.
ఏ వ్యాధులకు ప్రయోజనకరం?
కామెర్లు, అలసట, మూత్ర సంబంధిత సమస్యలు, డీహైడ్రేషన్ సమస్యలు ఉన్నవారికి చెరకు రసం అద్భుత ఔషధం. ఇది కాలేయాన్ని కూడా డీటాక్సిఫై లేదా శుద్ధి చేస్తుంది.
ప్లాస్టిక్ సీసాలలో ఎందుకు నిల్వ చేయకూడదు?
ప్లాస్టిక్‌లో ఉంచడం వల్ల రసం రుచి, నాణ్యతపై ప్రభావం పడుతుంది. ఇందులోని పదార్థాలు ప్లాస్టిక్ తో రసాయన చర్య జరిపేందుకు కారణవుతాయి.
నిమ్మకాయ, అల్లం జోడించడం అవసరమా?
నిమ్మకాయ, అల్లం కలపడం వల్ల రుచి బాగా ఉండటమే కాకుండా ఆక్సిడేషన్ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది.
తాగడానికి ఉత్తమ సమయం ఏది?
ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు చెరకు రసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరం. ఇలా చేస్తే శరీరానికి శక్తి దక్కుతుంది. జీర్ణక్రియను మెరుగుపడుతుంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చెరకు రసం ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే దాన్ని తాజాగానే తాగాలి. నిల్వ చేసి తాగితే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మీరు ఈసారి చెరకు రసం తాగినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చిన రసాన్ని 15-20 నిమిషాలలోపే తాగండి.
Read Also: Watermelon:పుచ్చకాయను భోజనానికి ముందు తినాలా.. తర్వాత తినాలా..
Dry Fruits: మీరు డ్రై ఫ్రూట్స్ తింటుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
Kumkuma Puvvu: ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగవచ్చా..