Share News

Kidney Stone Pain vs Back Pain: బ్యాక్ పెయినా? కిడ్నీ పెయినా? తేడా గుర్తించండిలా..!

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:33 PM

నేటి కాలంలో నడుం నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. కానీ, నడుం నొప్పి కేవలం వెన్నెముకలో సమస్య ఉంటేనే రాదు. కొన్నిసార్లు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ల వల్ల కూడా రావచ్చు. ఈ రెండు రకాల నొప్పులకు మధ్య తేడా గుర్తించండిలా..

Kidney Stone Pain vs Back Pain: బ్యాక్ పెయినా? కిడ్నీ పెయినా? తేడా గుర్తించండిలా..!
Kidney Stone Pain vs Back Pain

వయసు తారతమ్యాలు లేకుండా ఇటీవల అందరినీ వెన్నునొప్పి సమస్య వేధిస్తోంది. ప్రధానంగా రోజూ గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్ల ముందు వర్క్ చేసే వారు వెన్నునొప్పితో తరచూ బాధపడుతుంటారు. కానీ ప్రతి వెన్నునొప్పికి కారణం ఒకేలా ఉండదు. కొన్నిసార్లు కండరాల అలసట లేదా వెన్నెముక సమస్య వల్ల రావచ్చు. దీనిని సాధారణంగా వెన్నునొప్పి అని పిలుస్తారు. ఇంకొన్నిసార్లు నడుం నొప్పి కిడ్నీల్లో రాళ్ల వల్ల వస్తుంది. ఈ రెండింటికీ మధ్య తేడా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే రెండు నొప్పుల లక్షణాలు, చికిత్స వేర్వేరుగా ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని సరైన సమయంలో గుర్తించకపోతే మూత్రపిండాల్లో రాళ్ల నొప్పి భరించలేనిదిగా మారుతుంది. కిడ్నీలు పనిచేయకుండా పోయే ప్రమాదముంది.


కిడ్నీలో రాళ్ల నొప్పి సాధారణంగా నడుము దిగువ భాగంలో తీవ్రంగా ఉంటుంది. ఇది కడుపు, తొడ వరకు వ్యాపిస్తుంది. ఈ నొప్పి స్థిరంగా ఉండదు. వస్తూపోతూ ఉంటుంది. దీనితో పాటు తరచుగా మూత్ర విసర్జన రావడం, మూత్రంలో నురుగు లేదా రక్తం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరోవైపు, సాధారణ వెన్నునొప్పి నడుము భాగంలో ఉంటుంది. కండరాల బిగుతు లేదా తప్పు భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ నొప్పి వస్తుంది. వెన్నెముక సమస్య కూడా కారణం ఉండవచ్చు. వెన్నునొప్పి ఉంటే సరైన రోగ నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్, మూత్ర పరీక్ష చేయించుకోవాలి.


వెన్నునొప్పి లక్షణాలు

కండరాలపై అధిక ఒత్తిడి ఉన్నప్పుడు లేదా ఎక్కువసేపు తప్పుడు స్థితిలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఈ నొప్పి నెమ్మదిగా ప్రారంభమై క్రమంగా పెరుగుతుంది. కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే నడుం నొప్పి ఉన్న అనుభూతి పొందుతారు. మరికొందరు ఆఫీసులో ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేదా వంగిన తర్వాత వెన్నునొప్పితో బాధపడతారు. ఈ నొప్పి ఎక్కువగా నడుము మధ్యలో లేదా దిగువ భాగంలో సంభవిస్తుంది. శరీర కదలికల ద్వారా ప్రభావితమవుతుంది. అంటే నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు, వంగినప్పుడు నొప్పి పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అలాగే ఈ నొప్పి కొన్నిసార్లు దృఢత్వం, కండరాల అలసట వల్ల కలుగుతుంది.

కిడ్నీ రాళ్లు ఉంటే వెన్నునొప్పి లక్షణాలు

మూత్రపిండంలో రాయి ఏర్పడి మూత్రనాళంలో ఇరుక్కుపోతే ఆకస్మిక నొప్పి ప్రారంభమవుతుంది. ఈ నొప్పి సాధారణంగా నడుము ఒక వైపు నుంచి అంటే వీపు నుండి ప్రారంభమై దిగువ ఉదరం, తొడ లేదా జననేంద్రియ ప్రాంతానికి వ్యాపిస్తుంది. దీనిని రేడియేటింగ్ పెయిన్ అంటారు. ఈ నొప్పి కూర్చోవడం, నడవడం లేదా పడుకోవడం ద్వారా తగ్గదు. బదులుగా అలాగే కొనసాగుతుంది లేదా ఇంకా తీవ్రం కావచ్చు. కిడ్నీలో రాళ్లుంటే నడుం నొప్పితో పాటు, వాంతులు, మూత్రంలో మంట, రక్తస్రావం, మూత్రం దుర్వాసన రావడం లేదా తరచుగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉండవచ్చు.


ఎలా గుర్తించాలి?

  • వెన్నునొప్పి సాధారణంగా కండరాలు లేదా ఎముకలకు సంబంధించినది. విశ్రాంతి, స్ట్రెచింగ్ లేదా నొప్పి నివారణ మందుల ద్వారా ఉపశమనం లభిస్తుంది. కానీ కిడ్నీ రాళ్ల నొప్పి అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. చాలా తీవ్రంగా ఉంటుంది, సాధారణ నొప్పి నివారణ మందుల వేసుకున్నా తగ్గదు.

  • కిడ్నీ రాళ్లున్నప్పుడు నడుం నొప్పి వస్తే శరీర కదలికల వల్ల నొప్పి తగ్గదు. అదే వెన్నునొప్పి విషయంలో నడిచేటప్పుడు లేదా భంగిమ మారినప్పుడు నొప్పి తీవ్రత మారుతుంది. మూత్రంలో రక్తం, మంట లేదా రంగు వంటి ఏదైనా మార్పు ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గ్రహించాలి.

  • కాబట్టి, వెన్నునొప్పిని తేలికగా తీసుకోకండి. సకాలంలో సరైన కారణం గుర్తించి అవసరానికి అనుగుణంగా చికిత్స పొందండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

రోజూ ఈ 5 పనులు చేస్తే.. 90% సమస్యలు సాల్వ్..

పదే పదే జుట్టు దువ్వడం వల్ల పురుషులకు బట్టతల వస్తుందా?

For More Health News

Updated Date - Jul 26 , 2025 | 03:25 PM