Share News

NAFLD India: మద్యం తాగకున్నా.. దేశంలో 30% మందికి ఫ్యాటీ లివర్.. షాకింగ్ కారణాలివే!

ABN , Publish Date - Jul 30 , 2025 | 02:59 PM

నేటి కాలంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదం పెరుగుతోంది. పిల్లలు కూడా దీనితో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యం తాగకపోయినప్పటికీ.. దేశంలో నూటికి 30 మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు.

NAFLD India: మద్యం తాగకున్నా.. దేశంలో 30% మందికి ఫ్యాటీ లివర్.. షాకింగ్ కారణాలివే!
NAFLD Causes and Risk Factors

ఫ్యాటీ లివర్ ఇప్పుడు అంటువ్యాధిలా తయారైంది. ఇండియాలో వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక తీవ్ర వ్యాధులకు కారణమవుతున్నాయి. AIIMS ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం, భారత జనాభాలో దాదాపు 30% మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) తో బాధపడుతున్నారు. నిజానికి, ఆల్కహాల్ తాగితేనే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుందని అనుకుంటాం. కానీ, NAFLD రావడానికి ఆల్కహాల్ కారణం కాదు. చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలే ముఖ్య కారణాలు.


నేటి కాలంలో, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రమాదం చాలా పెరిగింది. పిల్లలలో కూడా ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించకపోతే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. భారతదేశంలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్లు తినే ధోరణి ఇటీవల బాగా పెరిగిపోవడమే ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని AIIMS పరిశోధనలో తేలింది.

ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలు

కొవ్వు, అధిక కేలరీలు ఉన్న ఆహారాలు తినేవారి కాలేయంలో కొవ్వు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వీట్లు, జంక్ ఫుడ్, స్టోరేజ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ రోజుల్లో పిల్లలు, యువతలో ఈ అలవాట్లు సర్వసాధారణం అయ్యాయి.

నిద్ర, ఒత్తిడి

తగినంత నిద్ర లేకపోవడం లేదా ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యే వ్యక్తుల హార్మోన్ల వ్యవస్థ చెదిరిపోతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని పెంచుతుంది. ఇది నేరుగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఫ్యాటీ లివర్‌ పనితీరును మరింత దిగజార్చుతాయి.


ఎవరికి ఎక్కువ ప్రమాదం

అధిక బరువు ఉన్నవారు లేదా నడుము చుట్టూ కొవ్వు పెరిగిన వారిలో ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం శరీరంలోని కొవ్వు జీవక్రియను దెబ్బతీస్తుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఉన్నవారికే ముప్పు ఎక్కువ.

మధుమేహం, అధిక రక్తపోటు

టైప్-2 డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు ఉన్నవారి కాలేయంపై ఎక్కువ భారం ఉంటుంది. ఈ వ్యాధులు జీవక్రియ సిండ్రోమ్‌తో సంబంధం కలిగి ఉంటాయి. ఇది నేరుగా కొవ్వు కాలేయానికి కారణమవుతుంది. అందువల్ల, షుగర్, బీపీ ఉన్నవారు వారి లివర్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు

కంప్యూటర్ ముందు లేదా ఆఫీసులో గంటల తరబడి కూర్చొనేవారి శరీరం కేలరీలను బర్న్ చేయదు. దీంతో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల కాలేయ పనితీరు మందగిస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది.


నివారణ ఎలా?

  • తగినంత నిద్ర పోవడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోండి

  • బరువును అదుపులో ఉంచుకోండి

  • చక్కెర, నెయ్యి, నూనె వంటి ఆహారాలను మితంగా తినాలి.

  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయండి

  • ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, ఫైబర్ చేర్చుకోండి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ మోసాలపై జాగ్రత్త.!

కట్ చేసిన అవకాడోను తాజాగా ఎలా ఉంచాలి?

For More Lifestyle News

Updated Date - Jul 30 , 2025 | 02:59 PM