Share News

Doom Scrolling Effects: డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నారా? ఈ డిజిటల్ వ్యాధితో జాగ్రత్త..

ABN , Publish Date - Jul 23 , 2025 | 09:07 AM

కూర్చున్నా.. నుంచున్నా.. పడుకున్నా.. ఫోన్‌ స్క్రోలింగ్ చేయడం నేటి తరం అలవాటు. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలోనే తలమునకలైపోతుంటారు. డూమ్ స్క్రోలింగ్ అంటే నెట్టింట్లో ప్రతికూల విషయాలను స్క్రోల్ చేసే అలవాటు వల్ల ఈ మానసిక రుగ్మతలు వస్తాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

Doom Scrolling Effects: డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నారా? ఈ డిజిటల్ వ్యాధితో జాగ్రత్త..
Doom Scrolling Effects

చాలామంది ఉదయం నిద్ర లేవగానే మొదట చేసే మొదటి పని ఫోన్ చూడటం. ఆ రోజు వార్తలు, విశేషాలు, తమకు నచ్చిన అంశాలను స్క్రోల్ చేస్తుంటారు. ఇక నెట్టింట్లో మనం ఏ కంటెంట్ అయితే ఎక్కువగా చూస్తామో అలాంటివే పదే పదే కనిపిస్తాయని తెలిసిందే. అందుకే తెలియకుండానే రోజూ ఒకే లాంటి అంశాలను ఫాలో అవుతుంటాం. ఇదొక చట్రం లాంటిది. అందులో ఇరుక్కుపోతే అక్కడ నుంచి బయటకు రాలేం. ముఖ్యంగా కరోనా సమయంలో డూమ్ స్క్రోలింగ్ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నేటికీ ఈ అలవాటు ప్రజల మనసులను, అలవాట్లను శాసిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.


ఈ ఆధునిక హైపర్‌కనెక్టివిటీ ప్రపంచంలో ప్రజలు గతంలో కంటే వేగంగా సమాచారం పొందగలుగుతున్నారు. ఇది వరమే కాదు. శాపం కూడా. ఎందుకంటే, డూమ్‌స్క్రోలింగ్ బాధితుడిగా మారేందుకు ఈ అంశం ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సోషల్ మీడియాలో లేదా వార్తా వేదికలలో ప్రతికూల విషయాలను స్క్రోల్ చేసే ఈ అబ్సెసివ్ ప్రవర్తన సమాచారం పొందడానికి ఒక మార్గం అని ఎవరైనా అనుకోవచ్చు. నిజానికి, ఇది నిశ్శబ్దంగా మన మెదడులను, మనస్సులను నాశనం చేస్తోంది.


డూమ్‌స్క్రోలింగ్ అంటే ఏమిటి?

ప్రతికూల వార్తలను చదవడం, బాధ కలిగిస్తుందని తెలిసినా అలాంటి వాటికోసమే గంటలు తరబడి నిరాశ, నెగటివిటీ పెంచే వాటిపై దృష్టిపెట్టడాన్ని డూమ్‌స్క్రోలింగ్ అంటారు. డిజిటల్ ప్లాట్ ఫాంలో నాలెడ్జ్ పెంచుకోవడానికి స్క్రోల్ చేయడం మంచిదే . కానీ, చాలామంది విచారంలో మునిగి ఉండేందుకే డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నారు.


డూమ్‌స్క్రోలింగ్‌కు మెదడు ఎలా స్పందిస్తుంది?

బాధ కలిగించే వార్తలు లేదా కంటెంట్‌ను నిరంతరం చూడడం వల్ల మన మెదడు పనితీరు, మానసిక స్థితి గణనీయంగా ప్రభావితమవుతాయి. విచారకరమైన వార్తలు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వాంతులు, తలనొప్పి, కండరాల తిమ్మిరి, మెడ, భుజం నొప్పి, ఆకలి లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయని హార్వర్డ్ నిపుణులు అంటున్నారు. చాలా మందిలో రక్తపోటు కూడా పెరుగుతుంది . మహిళలు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం.


మెదడుపై ఒత్తిడి

నిరంతరం ప్రతికూల విషయాలు స్క్రోల్ చేసేవారి మెదడును కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు ముంచెత్తుతాయి. ఇది మీ శరీరాన్ని దీర్ఘకాలిక లేదా తరచూ ఒత్తిడిలో ఉంచుతుంది. ఫలితంగా ఆందోళన, అలసట, చిరాకు తలెత్తుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించి వివిధ మానసిక సమస్యలు వస్తాయి.


భావోద్వేగ నియంత్రణ

బాధ కలిగించే విషయాలకు నిరంతరం చూస్తున్నప్పుడు మెదడులోని అమిగ్డాలా హైపర్ యాక్టివ్‌గా మారుతుంది. దీర్ఘకాలంలో ఇది మీ మెదడు వైరింగ్‌ను మారుస్తుంది. మరింత భావోద్వేగ ప్రతిచర్యలను పెంచి రోజువారీ ఒత్తిడిని నిర్వహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

డెసిషన్ మేకింగ్

పదే పదే ఒత్తిడికి లోనవుతున్నప్పుడు హేతుబద్ధమైన ఆలోచన, నిర్ణయం తీసుకోవడానికి దారితీసే ప్రిఫ్రంటల్ కార్టెక్స్ దెబ్బతింటుంది. దీని ఫలితంగా ఏ పనిపైనా దృష్టి లేదా ప్రణాళిక లేకపోవడం జరుగుతుంది. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం వంటివి సంభవించవచ్చు.


ఆందోళన, నిరాశ

ముఖ్యంగా ప్రపంచ సంక్షోభాలకు సంబంధించిన వార్తలను ఎక్కువగా మనసుకు ఎక్కించుకోవడం వల్ల నిరాశ, ఆందోళన పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

డీసెన్సిటైజేషన్

యుద్ధాలు, బీభత్సాలు, నేర సంబంధిత వార్తలను పదే పదే వినడం వల్ల మెదడు మొద్దుబారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివారు తక్కువ సానుభూతి కలిగి ఉంటారు. తరచూ నిస్సహాయత వ్యక్తం చేస్తుంటారు.


నివారించడానికి ఏమి చేయాలి?

  • మీ ఫోన్‌ను దూరంగా ఉంచండి. ఉదయం లేవగానే ఫోన్‌ చూడకపోతే ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

  • భోజనం చేసేటప్పుడు మీ ఫోన్‌ను దూరంగా ఉంచండి. వీలైతే సైలెంట్ మోడ్‌లో పెట్టుకోండి.

  • నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. ఈ బీప్‌లు మిమ్మల్ని అలర్ట్ మోడ్‌లో ఉంచుతాయి. ఇది ఆన్ లో ఉంటే వార్తల ముఖ్యాంశాలు, ఇమెయిల్‌లు, మెసేజెస్ చూడటం ప్రారంభిస్తారు. అందుకే మీ ఫోన్ సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయండి.

  • సానుకూల వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. రోజంతా ప్రతికూల వార్తలకు బదులుగా సానుకూల వార్తలను చూడండి లేదా వినండి. ఇది మీ ఒత్తిడిని కొద్దిగా తగ్గిస్తుంది.

  • ఎవరైనా మీకు ఎప్పుడూ విచారకరమైన లేదా హింసాత్మక వార్తలు చెబుతుంటే నిరాకరించండి. ఇది మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది.

  • డూమ్ స్క్రోలింగ్ అలవాటును వదులుకోలేకపోతున్నా లేదా అది మీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటే కచ్చితంగా మంచి సైక్రియాట్రిస్టును సంప్రదించండి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

మెదడుపై పని ఒత్తిడి.. స్క్రీన్‏ను ఎక్కువసేపు చూడడంతో సమస్యలు

రాత్రిళ్లు ఒళ్లంతా చెమట తడిపేస్తోందా? ఈ వ్యాధి లక్షణమే కావచ్చు.. జాగ్రత్త..

For More Health News

Updated Date - Jul 23 , 2025 | 09:20 AM