Share News

India Next Vice President: జగదీప్ తర్వాత ఉప రాష్ట్రపతి ఎవరు.. వినిపిస్తున్న పేర్లు ఇవే

ABN , Publish Date - Jul 23 , 2025 | 07:55 AM

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాతో తర్వాత ఎవరు వస్తారని కొత్త చర్చ మొదలైంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలువురి పేర్లు ఇప్పుడు చర్చలో ఉన్నాయి.

India Next Vice President: జగదీప్ తర్వాత ఉప రాష్ట్రపతి ఎవరు.. వినిపిస్తున్న పేర్లు ఇవే
India Next Vice President

దేశంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) తన పదవికి రాజీనామా చేసి దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన తర్వాత, ఆమోదం కూడా జరిగింది. ఆయన రాజీనామాతో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఖాళీ అయ్యింది. రాజ్యాంగం ప్రకారం, ఈ ఖాళీని వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే (India Next Vice President) చర్చ జోరందుకుంది. దీంతో ఈ పదవి కోసం ప్రధానంగా పోటీలో ఉన్న పలు పేర్లను ఓసారి పరిశీలిద్దాం.


నీతీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ (74) పేరు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది. ఇది ఊహించని పేరైనప్పటికీ, రాజకీయ విశ్లేషకులు దీనిని పూర్తిగా కొట్టిపారేయడం లేదు. ఎన్‌డీఏ మిత్రపక్షాల్లో ఒకరైన ఉపేంద్ర కుశ్వాహ వంటి నాయకులు, నీతీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవిని త్యజించి, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పస్వాన్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. జనతాదళ్ (యునైటెడ్) నాయకుడైన నీతీష్, బీహార్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పదవి ఆయనకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపును తెచ్చిపెట్టే ఛాన్సుంది.


వీకే సక్సేనా

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (67) పేరు కూడా ఈ రేసులో ఉంది. గత మూడేళ్లుగా దిల్లీలో ఆయన చేసిన కృషి, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంతో రాజకీయ ఘర్షణలు, ఆయనను వార్తల్లో నిలిపాయి. దిల్లీ జల్ బోర్డు నిర్ణయాల నుంచి నియామకాల వరకు, సక్సేనా ఆప్ ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఈ చర్యలు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన సక్సేనా, రాజకీయ అనుభవంతో పాటు పరిపాలనా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు.


మనోజ్ సిన్హా

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (66) కూడా ఈ రేసులో ఒక ప్రముఖ అభ్యర్థిగా ఉన్నారు. ఆగస్టు 6, 2025న ఆయన ఐదేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి పదవి ఆయనకు సరైన అవకాశంగా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో స్థిరత్వాన్ని తీసుకొచ్చిన ఘనతను ఆయనకు ఆపాదిస్తున్నారు. అయితే, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు, ఒక పోనీ ఆపరేటర్ మరణించిన ఘటన ఆయన పదవీకాలంపై సందిగ్ధత నెలకొంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడైన సిన్హా, రైల్వే శాఖలో జూనియర్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అనుభవం ఈ పదవికి బలం చేకూరుస్తుందని పలువురు భావిస్తున్నారు.


శశిథరూర్ పేరు కూడా..

సీనియర్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (69) కేంద్ర ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు దూరమవుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి భాజపాలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఉప రాష్ట్రపతి పదవి కోసం థరూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి థరూర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.


రాజకీయ డైనమిక్స్

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎన్‌డీఏకు ఒక అవకాశంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక రాజకీయ పరీక్షగా మారనుంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలు గోపాల్ గాంధీ (2017), మార్గరెట్ అల్వా (2022)లను రంగంలోకి దించాయి. ఈసారి కూడా ప్రతిపక్ష ఐక్యత పరీక్షకు గురి కానుంది. అదే సమయంలో, బీహార్ ఎన్నికలతో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏకకాలంలో జరగకుండా బీజేపీ వ్యూహాత్మకంగా చూసుకోవచ్చు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా ఈ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు కావడం, బీజేపీ మద్దతు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 10:48 AM