World Cancer Day 2025: ఈ ఏడాది లోపుగా క్యాన్సర్ కేసులు 85% పెరుగుతాయి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ
ABN , Publish Date - Feb 04 , 2025 | 01:06 PM
2050 నాటికి ఆగ్నేయాసియా ప్రాంతంలో క్యాన్సర్ కేసులు మరియు మరణాలు 85% పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేస్తోంది. కాబట్టి క్యాన్సర్ మహమ్మారి బారిన పడకూడదంటే ప్రజలంతా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ వ్యాధి కారకాలు, నివారణ మార్గాలు వంటి విషయాల గురించి తెలుసుకుందాం..

2050 నాటికి ఆగ్నేయాసియా ప్రాంతంలో క్యాన్సర్ కేసులు మరియు మరణాలు 85% పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేస్తోంది. కాబట్టి క్యాన్సర్ మహమ్మారి విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలని, క్యాన్సర్ రోగులకు మద్ధతుగా నిలబడాలని చాటి చెప్పేందుకు ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్నాం.ఈ సందర్భంగా కింది జాగ్రత్తలు పాటిస్తే 30 నుంచి 50% క్యాన్సర్లను తప్పకుండా నివారించవచ్చు. అందుకు అనుసరించాల్సిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర విషయాల గురించి తెలుసుకోండి.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సారి "యునైటెడ్ బై యునిక్" అంటే సమిష్టిగా క్యాన్సర్‌పై పోరాడదాం అనే నినాదంతో జరుపుకోవాలని నిశ్చయించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). ప్రజలందరికీ ఈ వ్యాధి కారకాలు, నివారణ, గుర్తించే విధానం, చికిత్స వంటి అంశాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ రోజున విరివిగా అవగాహనా కార్యక్రమాలు చేపడతాయి. ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ, క్యాన్సర్ రోగుల కుటుంబాలను ఆదుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.
2022లో ఆగ్నేయాసియా ప్రాంతంలో 24 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 56,000 మంది పిల్లలే ఉన్నారు. మొత్తం 15 లక్షల మంది క్యాన్సర్ కారణంగా మరణించారు. దీన్ని బట్టే ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కువ మందికి బాల్యంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు. ఇతరుల్లో పెదవులు, నోటి కుహరం, గర్భాశయ క్యాన్సర్లు అత్యధికంగా ఉన్నాయి. 2050 నాటికి ఆగ్నేయాసియాలో కొత్త క్యాన్సర్ కేసులు, మరణాలు రెండింటిలోనూ 85% పెరుగుదల కనిపిస్తుందని WHO అంచనా వేస్తోంది.
క్యాన్సర్ నివారణకు సాధారణ చిట్కాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం క్యాన్సర్ ప్రమాద కారకాలను నివారించడం ద్వారా 30 నుండి 50% క్యాన్సర్లను నివారించవచ్చు. ఇలాంటి క్యాన్సర్ల నుంచి ఎలా తప్పించుకోవచ్చో చూద్దాం.
మద్యం : అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం, రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయంలో పరిమితి మించితే అనర్థం తప్పదు.
పొగ మానేయాలి : ధూమపానం మానేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఎందుకంటే పొగాకు పొగలో 70 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలు ఉన్నాయి.
బరువు : అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వల్ల రొమ్ము, పెద్దప్రేగు, మూత్రపిండాల క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
సమతుల ఆహారం : ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. ప్రాసెస్ ఫుడ్, రెడ్ మీట్, చక్కెర పానీయాల వినియోగం తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఈ అలవాట్లు బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. తగినంత శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా క్యాన్సర్ కారకాలను ఆదిలోనే నివారించవచ్చు.
చర్మ సంరక్షణ : కలుషిత వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ వేసుకోవడం వంటి చర్మ సంరక్షణ పద్ధతులు పాటించాలి. తీవ్ర ఎండకు, హానికరం సౌందర్య ఉత్పత్తులకు దూరంగా ఉంటే చర్మ క్యాన్సర్లు సోకకుండా ఆపవచ్చు.
నిద్ర, ఒత్తిడి : దీర్ఘకాలిక ఒత్తిడి మీ రోగనిరోధక శక్తిని బలహీనపరిచి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అభ్యసించండి. నిద్రలేమి అలవాట్లు క్యాన్సర్ కారకాలను చేరదీస్తాయి. కాబట్టి రోజూ 7-8 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.
స్క్రీనింగ్, టీకాలు : క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. అప్పుడు చికిత్స చేయడం సులభం. జన్యుపరంగానూ కొన్ని సార్లు వచ్చే అవకాశముంది. ఈ విషయమై వైద్యుడితో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. HPV వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తే, హెపటైటిస్ బి వ్యాక్సిన్ కాలేయ క్యాన్సర్ నివారిస్తుంది. అందుకే ఈ టీకాలు ముందస్తుగా వేసుకుంటే మంచిది.