Brain Damaging Habits: ఇలాంటి అలవాట్లు కూడా బ్రెయిన్‌కు డేంజరని తెలుసా మీకు..
ABN , Publish Date - Jul 27 , 2025 | 10:57 AM
నిరంతర మల్టీ టాస్కింగ్, అల్పాహారం దాటవేయడం లేదా గంటల కొద్దీ స్క్రోలింగ్ వంటి రోజువారీ అలవాట్లు మెదడుకు నిశ్శబ్దంగా హాని కలిగిస్తాయని న్యూరోసైన్స్, మనస్తత్వశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైకి అల్పమైనవిగా అనిపించే ఈ పనులు దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయని..

మల్టీటాస్కింగ్ వల్ల వేగంగా పనులు పూర్తయ్యే మాట వాస్తవమే. కానీ, నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే ఈ సామర్థ్యం మానసిక శక్తిని హరించివేస్తుంది. ఎక్కువగా ఇదే అలవాటు కొనసాగిస్తూ పోతే కొన్నాళ్లు పోయాక ఒక్కపని కూడా సరిగా చేయలేని స్థితిలోకి వెళ్లిపోతారంటే ఆశ్చర్యంగా అనిపించక మానదు. ఇదే కాదు.. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ మానేయడం, గంటల కొద్దీ స్క్రోలింగ్, నిద్ర లేమి ఇలా చాలా అలవాట్లు మెదడు పనితీరును నిశ్శబ్దంగా డ్యామేజ్ చేస్తాయి. ఈ చిన్ని అలవాట్లు మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి
మెదడును దెబ్బతీసే అతిపెద్ద ప్రమాదాలలో నిద్ర లేమి ఒకటి. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మెదడు తర్వాతి రోజు యాక్టివ్ గా ఉండేందుకు కావాల్సిన శక్తిని సమకూర్చుకోలేదు. పాతజ్ఞాపకాలు చెల్లాచెదురుగా అయిపోయి ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞాపకశక్తిని ఏకీకృతం చేయడానికి నిద్ర చాలా అవసరం. స్లీప్ అప్నియా, ఇతర నిద్ర సంబంధిత సమస్యలు వచ్చి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
బ్రేక్‌ఫాస్ట్
అల్పాహారం దాటవేయడం అనేది అందరిలో సర్వసాధారణంగా కనిపించే మరో లక్షణం. రోజులో తీసుకోవాల్సిన మొట్ట మొదటి భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే, సుదీర్ఘ విరామం తర్వాత శరీరానికి, మెదడుకు తగినంత శక్తి అవసరమవుతుంది. ఉదయం మేల్కొన్న తరువాత వీలైనంత త్వరగా ఫ్రెషప్ అయి అల్పాహారం సేవిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చిరాకు, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు రానేరావు.
స్క్రీన్ టైం
అర్ధరాత్రి పక్క చేరిన తర్వాతా ఫోన్ స్క్రీన్ చూస్తూ పడుకునే అలవాటు చాలా ప్రమాదకరం. స్క్రోలింగ్ వల్ల ఒత్తిడి పెంచే కార్టిసాల్ హార్మోన్ అధిక మోతాదులో విడుదలవుతుంది. మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. నిద్రకు అంతరాయం కలిగిస్తుందని న్యూరో సైంటిస్టులు చెబుతున్నారు. పడుకునే ముందు తప్పనిసరిగా 30 నిమిషాల స్క్రీన్-ఫ్రీ వైండ్-డౌన్ రొటీన్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మల్టీటాస్కింగ్
చేయాల్సిన పనుల జాబితా అధికంగా ఉన్నా మెదడు పని సామర్థ్యం తగ్గుతుంది. జ్ఞాపకశక్తి కూడా దెబ్బతింటుంది. ఆందోళనను తగ్గించడానికి, ఏకాగ్రతను మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ మూడు అర్థవంతమైన పనులను మాత్రమే జాబితాలో చేర్చుకోవడం అవసరం. ప్రతి పనికి సమయాన్ని కేటాయిస్తే అనవసరమైన గందరగోళాన్ని నివారించవచ్చు.
ఒంటరితనం
సామాజికంగా అందరితో కలుపుగోలుగా లేకుండా ఉండే వ్యక్తులకు మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం మరీ ఎక్కువ. ఒంటరితనం జీవితంపై స్పష్టతను కోల్పోయేలా చేస్తుంది. మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. అయితే క్రమం తప్పకుండా హృదయనాళానికి రక్త ప్రవాహాన్ని పెంచే వ్యాయామాలు చేయడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.
LDL కొలెస్ట్రాల్
LDL కొలెస్ట్రాల్ ఒక చెడు కొలెస్ట్రాల్. ఇది శరీరంలో అధిక మోతాదులో పేరుకుపోతే క్రమక్రమంగా మానసిక ఆరోగ్యా్న్ని ప్రమాదంలోకి నెడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి పెద్దలు LDL నియంత్రణలో జాగ్రత్తగా ఉండటం అవసరం.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
తెల్లవారుజామున 3 - 5 గంటల మధ్య మెళకువ వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త