Share News

ఒక్కసారి చూస్తే చాలు...

ABN , Publish Date - Jul 27 , 2025 | 09:47 AM

మనుషుల ముఖాలను గుర్తించడంలో కుక్కను మించింది లేదంటారు. ఎంతమందినైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటుంది. అయితే ఈ సామర్థ్యం కుక్కలకు మాత్రమే ఉందా? అంటే... ‘ఇంకా చాలా పక్షులు, జంతువులకు ఉందంటున్నారు నిపుణులు.

ఒక్కసారి చూస్తే చాలు...

మనుషుల ముఖాలను గుర్తించడంలో కుక్కను మించింది లేదంటారు. ఎంతమందినైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటుంది. అయితే ఈ సామర్థ్యం కుక్కలకు మాత్రమే ఉందా? అంటే... ‘ఇంకా చాలా పక్షులు, జంతువులకు ఉందంటున్నారు నిపుణులు. వాటి విశేషాలే ఇవి...

మాట్లాడే చిలుకల గురించి వినే ఉంటారు. చిలుకలు మాట్లాడటం కాదు, మనుషులను గుర్తించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇంట్లో వాళ్లను, బయటి వాళ్లను స్పష్టంగా గుర్తిస్తాయి. వాటి దృష్టి సామర్థ్యం గొప్పదని శాస్త్రవేత్తలు తేల్చారు.

పావురాలకు మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం ఉంది. వేర్వేరు దుస్తులు ధరించినా, హెయిర్‌కట్‌ మార్చినా పావురాలు సరిగ్గానే గుర్తుపడతాయి. ఫొటో చూపించినా ముఖాలను గుర్తిస్తాయి. నగరాల్లో ఉండే పావురాలకు ఈ సామర్థ్యం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆహారం వేసే వారిని అవి గుర్తు పెట్టుకుంటాయి.


book4.2.jpg

మనుషుల్లాగే చింపాంజీలు వ్యక్తులను గుర్తిస్తాయి. గతంలో ఒకసారి కలిసిన వ్యక్తులను ఇట్టే గుర్తుపడతాయి. వాటి మెదడు పనితీరు మనుషులను పోలి ఉంటుంది. చింపాంజీలు ప్రత్యేకమైన ఐ-ట్రాకింగ్‌ టెక్నాలజీతో ముఖాలను స్కాన్‌ చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

తేనెటీగలు మనుషులను గుర్తిస్తాయంటే నమ్మాల్సిందే. వాటి మేథోశక్తి అమోఘం. తేనెటీగలు మనుషుల ముఖాలు గుర్తించేలా శిక్షణ ఇవ్వడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. చక్కెరను బహుమతిగా అందివ్వడం ద్వారా... మనుషుల ముఖాలలో వ్యత్యాసాలను గుర్తించేలా వాటికి శిక్షణ ఇచ్చారు. మను షులను గుర్తించడానికి అవి ‘కాన్ఫిగరల్‌ ప్రాసెసింగ్‌’ అనే టెక్నిక్‌ను ఉపయోగిస్తాయి.


సముద్రపు అడుగున ఉండే ఆక్టోపస్‌ సైతం మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. ముఖగుర్తింపులో అది ఎక్స్‌పర్ట్‌ కూడా. వాటిలో ఉన్న సంక్లిష్టమైన నాడీవ్యవస్థతోనే ముఖాలలో తేడాలను గుర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అవి ఆహారాన్ని అందించేవారిని గుర్తుపెట్టుకుంటాయి. వారు కనిపించగానే దగ్గరకు వెళ్తాయి.

book4.3.jpg

కాపరి చేసే శబ్దాలను గొర్రెలు స్పష్టంగా అర్థం చేసుకుంటాయి. అందుకు అనుగుణంగా నడుచుకుంటాయి. అయితే వాటికి మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం కూడా ఉంది. గొర్రె 50 మందికి పైగా మనుషులను గుర్తించగలుగుతుంది. మనుషుల ముఖాలను గుర్తించేందుకు వాటికి ప్రత్యేక బ్రెయిన్‌ సర్క్యూట్‌లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.


మనుషుల ముఖాల్ని డాల్ఫిన్లు సైతం గుర్తుపడతాయి. అవి సోనార్‌ సహాయంతో ముఖాలను గుర్తిస్తాయి. శబ్ధం సహాయంతో అవి చూడగలు గుతాయన్నమాట. డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చే వాళ్లు సైతం ఈ విషయాలను ధ్రువీ కరిస్తున్నారు. నీటి ఒడ్డున నిల్చున్న వారిలో పరిచయం ఉన్న వ్యక్తులను సులభంగా గుర్తిస్తుంటాయని ట్రైనర్లు చెబుతుంటారు.

book4.4.jpg

ఒకసారి చూస్తే మనిషి ముఖాన్ని ఏనుగు ఎప్పటికీ మరిచిపోదు. ఏనుగుల్లో అద్భుతమైన ‘ఫేషియల్‌ రికగ్నిషన్‌’ సామర్థ్యాలు ఉన్నాయి. ఏనుగుతో కొంతకాలం సహవాసం చేసిన వ్యక్తులు దశాబ్దం తరువాత కనిపించినా గుర్తుపట్టేస్తాయి. ఏనుగులకు జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే.


గుర్రం ఒక్కసారి చూసినా ఏళ్లపాటు గుర్తుపెట్టుకుంటుంది. కేర్‌టేకర్స్‌ని, యజమానుల్ని ఇట్టే గుర్తుపడుతుంది. కొత్త వ్యక్తులు వస్తే దూరంగా జరుగుతుంది. గతంలో కేర్‌టేకర్‌గా పనిచేసిన వ్యక్తి కొన్నేళ్ల తర్వాత కనిపించినా గుర్తు పట్టేస్తుంది.

కాకి మనిషిని ఒకసారి చూస్తే కొన్ని ఏళ్లదాకా గుర్తుపెట్టు కుంటుంది. ముఖ్యంగా వాటికి హాని చేసిన వారిని అస్సలు మరిచిపోవు. పరిశోధకులు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు కాకులను పట్టుకుని మరో ప్రదేశంలో వదిలేశారు. కొన్ని రోజుల తరువాత ఆ వ్యక్తులే మాస్కులు ధరించి వెళుతుండగా కాకులు గుర్తించి అరవడం చేశాయి. దీన్నిబట్టి కాకి ముఖగుర్తింపు సామర్థ్యాన్ని కలిగి ఉందని తేల్చారు.

Updated Date - Jul 27 , 2025 | 09:47 AM