Iphone 17 Pro Max: ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని మార్పులు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:17 PM
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్‌లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు ఇంటర్నెట్‌లో వెలువడ్డాయి. ఆపిల్ తర్వాతి తరం ఐఫోన్ 17 సిరీస్‌లో అతి పెద్ద మార్పులను తీసుకువస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. కొత్త ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇండియాలో 2025 సెప్టెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. గత సంవత్సరం నాన్-ప్రో మోడళ్లలో మాత్రమే డిజైన్ మార్పులు చేసింది టెక్ దిగ్గజం యాపిల్. అయితే, ఈసారి ఐఫోన్ ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రొ, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పేరుతో కొత్త మోడళ్లు విడుదలవుతాయని అంచనా. గత సంవత్సరం ప్రారంభించిన ఐఫోన్ 16 ప్రో మాక్స్ కంటే ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో భారీ అప్‌గ్రేడ్‌లు ఉండబోతున్నాయనే వార్తలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. మరి, ఈ సంవత్సరం యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతోందో చూద్దాం..
భారత్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
ఆపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంటుంది. గత సంవత్సరం కూడా సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సంవత్సరం యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ని 17 Pro Maxతో సహా సెప్టెంబర్ 6-13 మధ్య సెప్టెంబర్ రెండవ లేదా మూడవ వారంలో విడుదల చేయనుంది. సెప్టెంబరు 19 లేదా 20 నుంచి మార్కెట్లో లభ్యమవుతుందని అంచనా.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర (అంచనా)..
గతేడాది యాపిల్ తన బేస్ మోడల్స్ ధరలను పెంచకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి, ఐఫోన్ 15 ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరలో ఐఫోన్ 16 ప్రో మోడల్స్ ప్రారంభించబడ్డాయి. ఐఫోన్ 15 ప్రో కోసం రూ. 1,34,900 కాగా ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900. అదేవిధంగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (రూ.1,59,900) కంటే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (రూ. 1,44,900) ధర రూ. 15,000 తక్కువ. అయితే, ఈ సంవత్సరం డిజైన్‍లో మార్పుల కారణంగా ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ధరలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు. రూ. 1,45,000 ప్రీమియం ధర ఉంటుందని అంచనా.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్..
ఐఫోన్ 17 ప్రో మాక్స్ సరికొత్త డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు. యాపిల్ టైటానియం, స్టెయిన్‌లెస్ స్టీల్‌కు బదులుగా ఐఫోన్ Xలో చివరిగా ఉపయోగించిన అల్యూమినియంకు తిరిగి మారవచ్చు. ఈ మార్పు ఫోన్ చూస్తున్నప్పుడు మరింత తేలికగా అనిపిస్తుంది. వెనుక వైపు మన్నిక కోసం అల్యూమినియం, అడుగున వైర్‌లెస్ ఛార్జింగ్‌కు అనుగుణంగా గ్లాస్ ఉండవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్..
వేగవంతమైన పనితీరు, మెరుగైన సామర్థ్యం కోసం యాపిల్ కొత్త A19 ప్రో చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అధునాతన AI ఫీచర్లను నిర్వహించడానికి ఇందులో గరిష్ఠంగా 12GB ర్యామ్ కూడా ఉండవచ్చు. అత్యాధునిక కెమెరాలు గణనీయంగా మెరుగుపరచడానికి సెట్ చేయబడ్డాయి. ఐఫోన్17 ప్రొమ్యాక్స్ వైడ్, అల్ట్రా వైడ్. కొత్త టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్ వంటి మూడు 48MP కెమెరాలతో రావచ్చు . ఇదివరకు పాత మోడళ్లలో 12MPనే ఉండేది. ఇక ముందు కెమెరా 24MPకి అప్‌గ్రేడ్ చేయబడుతుందని భావిస్తున్నారు.