Railway tickets on EMI: ఈఎంఐలో రైలు టికెట్లు.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్..
ABN , Publish Date - Jul 23 , 2025 | 09:17 AM
ఈ మధ్య ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక, పర్యాటక టూర్ల కోసం వివిధ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. మీకు వెళ్లాలని మనసులో ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేమని వెనకేస్తున్నట్లయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇ-కామర్స్ సైట్లలో లాగే రైలు టికెట్లనూ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతిలో డబ్బులుండవు. అర్జంటుగా ఊరికెళ్లాలి. ఎవరి దగ్గర చేబదులు తీసుకోవాలా అనే ఆలోచనలు మనసును ముంచెత్తుంటాయి. కానీ, ప్రయాణికులు అలా చింతించాల్సిన అవసరం లేకుండా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈఎంఐలో ట్రైన్ టికెట్ కొనుగోలు చేసే సదుపాయం ప్రవేశపెట్టిందని మీకు తెలుసా. ఇ-కామర్స్ సైట్లలో ఎలాగైతే మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నామో.. అచ్చం అలాగే ఇకపై ట్రైన్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ఈఎంఐ ట్రైన్ టికెట్ సేవలను ఐఆర్‌సీటీసీ క్యాష్‌ఈ (CASHe) సంస్థతో కలిసి నిర్వహిస్తోంది. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లోని ‘ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి’ (Travel now pay later- TNPL) అనే ఆప్షన్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకుని వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు. సాధారణ, తత్కాల్ టికెట్ బుకింగ్ కోసమూ ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.
యాప్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఎలాంటి డాక్యుమెంటేషన్ సమర్పించకుండానే ఈ సేవలు పొందవచ్చు. 6 లేదా 8 నెలల వ్యవధిలో ఇన్స్టాల్మెంట్లు చెల్లించే సౌకర్యాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. పూర్తి టికెట్ అమౌంట్ మాత్రమే కాకుండా టికెట్ బుకింగ్ సమయంలో కొంత మొత్తం చెల్లించి మిగిలినది ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటూ ఉంది. కాలవ్యవధి ఆధారంగా వడ్డీరేటు ఉంటుందని గుర్తుంచుకోవాలి.
అయితే, ఈ ఆఫర్ దేశంలోని అన్ని రైళ్లకు వర్తించదు. భారత్ గౌరవ్ రైలుకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తోంది IRCTC. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి రైల్వేశాఖ ఈ రైళ్లను ప్రారంభించింది. గౌరవ్ రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు మాత్రమే EMI ఆప్షన్ ఎంచుకోగలరు. ఉదాహరణకు సెప్టెంబర్ 13-సెప్టెంబర్ 22 మధ్య నడిచే భారత్ గౌరవ్ రైలులో టికెట్ బుక్ చేసుకున్నారని అనుకుందాం. ఈ రైలు ఎకానమీ క్లాస్ ఛార్జీ ఒక్కొక్కరికి రూ. 18,460, థర్డ్ AC కోచ్ ఛార్జీ ఒక్కొక్కరికి రూ. 30,480, అదేవిధంగా, కంఫర్ట్ కేటగిరీ ఛార్జీ రూ. 40,300. ఇందులో స్లీపర్ క్లాస్ రైలు టికెట్, హోటల్ వసతి సౌకర్యాలు ఉంటాయి. కానీ, ఈ అధిక ఛార్జీని చెల్లించడంలో చాలామందికి ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టే రైల్వేలు EMI సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
బంగారం ధర మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి