MP Kalisetty Appalanaidu: రుషికొండను బోడిగుండు చేశారు.. జగన్‌పై ఎంపీ కలిశెట్టి విసుర్లు
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:59 AM
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పుంజుకుందని నొక్కిచెప్పారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP MP Kalisetty Appalanaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. రుషికొండను బోడిగుండు చేసి, రూ.500 కోట్లు వృథా చేసి భవనాలు నిర్మించుకున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రను జగన్ రెడ్డి ఉత్తుత్తి ఆంధ్రగా మార్చేశారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో జగన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇవాళ(శుక్రవారం, జులై 18) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ఉద్ఘాటించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పుంజుకుందని నొక్కిచెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో బిక్కు బిక్కు మంటూ గడిపిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు, నేడు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు, ప్రాజెక్ట్‌లు, పథకాలు అన్ని సక్రమంగా అమలవుతున్నాయని స్పష్టం చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఎన్డీఏని భారీ మెజార్టీతో గెలిపించిన ఉత్తరాంధ్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, టీసీఎస్, కాగ్నిజైంట్ వంటి అనేక పరిశ్రమలను ఏడాదిలోనే సాధించామని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వానికి పూర్తి అయింది ఏడాది మాత్రమేనని... ఇంకా చాలా చేస్తాం, చూస్తూ ఉండాలని అన్నారు. ఉత్తరాంధ్ర నాయకుడు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇవ్వడంపై ఉత్తరాంధ్ర వాసులుగా గర్విస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నౌకాదళంలోకి స్వదేశీ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’
ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు
Read latest AP News And Telugu News