Share News

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కాదు.. కేంద్రమంత్రి భూపతిరాజు స్పష్టీకరణ..

ABN , Publish Date - Jul 30 , 2025 | 08:36 AM

తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కాదు.. కేంద్రమంత్రి భూపతిరాజు స్పష్టీకరణ..
Vizag Steel Plant

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. యూపీకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆదిత్య యాదవ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ప్లాంట్‌ను కొనసాగించేందుకు ఇప్పటివరకు రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు.


ఏపీలో 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి.. కానీ కార్డులు లేవు

ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ పథకం కింద ఇప్పటివరకు 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వేలు పూర్తయ్యాయని.. అయితే ఒక్క ప్రాపర్టీ కార్డు కూడా జారీ కాలేదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ భగేల్ తెలిపారు. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. శ్రీకాకుళం (1,352 గ్రామాలు), తిరుపతి (1,045), విజయనగరం (950) జిల్లాల్లో అధికంగా సర్వేలు జరిగినట్లు చెప్పారు. విశాఖపట్నంలో అత్యల్పంగా 85 గ్రామాల్లో మాత్రమే సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.


ఆర్‌జీఎస్‌ఏ కింద ఏపీకి రూ.316 కోట్ల ప్రణాళిక

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.316.22 కోట్ల విలువైన వార్షిక ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.15.33 కోట్లు పూర్తిగా వినియోగించకపోవడంతో కొత్త నిధులు విడుదల చేయలేదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.4.85 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కోసం రాష్ట్రం 9 ప్రాజెక్టులను పంపినట్లు పేర్కొన్నారు.


ఏపీలో 714 ఎఫ్‌పీఓలు

ఆంధ్రప్రదేశ్‌లో 714 రైతు ఉత్పత్తి సంఘాలు (FPOs) నమోదయ్యాయని.. వీటిలో 1.70 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సంఘాలు ప్రధానంగా ధాన్యం, పప్పులు, కొబ్బరి, పసుపు, మామిడి, మిరప వంటి ఉత్పత్తుల వ్యవహారాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అత్యధికంగా 39 ఎఫ్‌పీఓలు, అనంతపురం, వైఎస్సార్ కడపల్లో 38 చొప్పున నమోదయ్యాయని చెప్పారు.


ఉపాధి హామీ పథకంలో రూ.1,660 కోట్లు బకాయి

ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికీ రూ.1,660.9 కోట్ల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేష్ పాస్వాన్ లోక్‌సభలో వెల్లడించారు. అదే సమయంలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన - 3 కింద రాష్ట్రానికి 3,203.94 కిలోమీటర్ల పొడవైన 412 రహదారులు, 77 వంతెనలు మంజూరు చేసినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు

వైసీపీ మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 08:53 AM