Share News

Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

ABN , Publish Date - Jul 30 , 2025 | 07:54 AM

రష్యాలో 8.8 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
Russia Earthquake

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఈరోజు 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం (Russia Earthquake) సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు.


భూకంప వివరాలు

రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ప్రారంభంలో 8.7 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత 8.8గా సవరించబడింది. ఈ తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3-4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డయ్యాయి. రష్యా అధికారుల ప్రకారం, ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది.


సునామీ హెచ్చరికలు

ఈ భూకంపం తర్వాత, జపాన్‌లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినట్లు జపాన్ మీడియా తెలిపింది. జపాన్ ప్రభుత్వం పసిఫిక్ తీరంలోని ప్రజలకు వెంటనే ఖాళీ ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలల వల్ల నష్టం సంభవించే అవకాశం ఉంది. తీర ప్రాంతాలు, నదీ తీరాల నుంచి ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా సురక్షిత భవనాలకు వెళ్లాలని తెలిపింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రదేశాన్ని వదిలి వెళ్లవద్దని జపాన్ అధికారులు పేర్కొన్నారు.


హవాయి రాజధాని..

ఈ నేపథ్యంలో అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హవాయి రాజధాని హోనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలకు తక్షణ స్థలం ఖాళీ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్వామ్ దీవిలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే ఛాన్స్ ఉందని అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.

రష్యాలో పరిస్థితి..

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3-4 మీటర్ల ఎత్తుతో తాకాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎవరికి గాయాలు లేనప్పటికీ, ఒక కిండర్‌గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు కమ్చట్కా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మంత్రి సెర్గీ లెబెడెవ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 08:13 AM