Anitha Temple Visit: జగన్నాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి
ABN , Publish Date - Jul 04 , 2025 | 09:26 AM
Anitha Temple Visit: పది రోజులు దశావతారంలో స్వామివారు ప్రజలందరికీ దర్శనభాగ్యం కల్పిస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రతి సంవత్సరం జగన్నాధ స్వామివారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని వెల్లడించారు.

విశాఖపట్నం, జులై 4: నగరంలోని మహారాణిపేట జగన్నాథ స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ఈరోజు (శుక్రవారం) ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగన్నాథ స్వామికి హోంమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనిత. రామావతారంలో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం హోంమంత్రికి పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆపై స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని మంత్రి అనితకు ఆలయ అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పది రోజులు దశావతారంలో స్వామివారు ప్రజలందరికీ దర్శనభాగ్యం కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతీ సంవత్సరం జగన్నాథ స్వామివారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గం పాండురంగ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం తనకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం తనకు ఎంతో పుణ్యఫలమన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
కాగా.. మహారాణిపేట జగన్నాథ స్వామి పది రోజుల పాటు దశావతారాల్లో ప్రజలకు దర్శనమివ్వనున్నారు. ఆ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు రామావతారంలో ఉన్న స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఇవి కూడా చదవండి
కూలీ పంట పండింది.. విలువైన వజ్రం దొరికింది.. ధర ఎంతో తెలుసా..
నదీ జలాల కేటాయింపులపై తెలంగాణ నేతల మాటలన్నీ అబద్ధాలే
Read latest AP News And Telugu News