Share News

JAC Chairman: ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:36 AM

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీజీఓ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ విజ్ఞప్తి చేశారు.

JAC Chairman: ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  • ప్రభుత్వానికి ఏపీ ఎన్జీజీఓ విజ్ఞప్తి

  • ఉద్యోగ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా డి.వి.రమణ ఎన్నిక

విజయవాడ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీజీఓ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) నూతన చైర్మన్‌గా విద్యాసాగర్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా డి.వి.రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గురువారం విజయవాడలోని ఎన్జీజీఓ హోమ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తానన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవడం వల్లే ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ.27 వేల కోట్లు బకాయిలు పెట్టిందని, సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం రూ.7500 కోట్లు ఉద్యోగులకు చెల్లించిందని విద్యాసాగర్‌ పేర్కొన్నారు. ఇప్పటికీ మూడు డీఏలు ప్రభుత్వం నుంచి బకాయి ఉండగా, జూలైలో నాలుగో డీఏ ప్రకటించాల్సి ఉందన్నారు. కేవలం వైద్య, ఉపాధ్యాయ రంగాల్లో ఉన్న పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని తెలిపారు. పీఆర్సీ కమిషనర్‌ నియామకం, డీఏల మంజూరు, సరెండర్‌ లీవ్‌ల చెల్లింపు, పెన్షనర్లకు గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీచేస్తూ.. క్వాంటం పెన్షన్‌ విధానంలో మార్పులు, ఉద్యోగుల ఆరోగ్యసేవల కోసం ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాకు జమచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2004కు ముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్‌ విధానం అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేఎ్‌సఎస్‌ ప్రసాద్‌ కోరారు.

Updated Date - Jul 04 , 2025 | 05:40 AM