Share News

Cannabis Eradication: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:33 AM

రాష్ట్రంలో గంజాయిని రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ‘ఆపరేషన్‌ విజయ్‌’ నిర్వహిస్తున్నామని ఈగల్‌ టీమ్‌ ఐజీ ఎ.రవికృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రం ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌లో...

Cannabis Eradication: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక

  • ఏలూరులో ‘ఈగల్‌’ ఐజీ రవికృష్ణ వెల్లడి

  • అక్రమ రవాణా సమాచారంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

ఏలూరు క్రైం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయిని రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ‘ఆపరేషన్‌ విజయ్‌’ నిర్వహిస్తున్నామని ఈగల్‌ టీమ్‌ ఐజీ ఎ.రవికృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రం ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక పోలీసు బలగాలు, జాగిలాలతో విశాఖపట్టణం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును తనిఖీ చేశారు. ఏలూరు నుంచి విజయవాడ వరకూ ఈ తనిఖీలు చేపట్టారు. ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఒడిశా నుంచి రైళ్లల్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉండడంతో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో 21,736 కేజీల గంజాయిని పట్టుకుని, నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 375 గ్రామాల్లో 359 కుటుంబాలు గంజాయి సాగు చేయడంతో.. వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలుగా 22 రకాల వివిధ జాతుల 46 లక్షల మేర మొక్కలను 10,256 మంది రైతులకు అందజేశామన్నారు. పదేపదే గంజాయి స్మగ్లింగ్‌ చేసే వారిని గుర్తిస్తున్నామని, ఐదు కేసుల్లో ఎన్‌డీపీఎ్‌స చట్టం చాప్టర్‌ -5ఏ ప్రకారం వారికి సంబంధించిన రూ.7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశామని వివరించారు. ఇంకా 16 కేసుల్లో ఆస్తులు సీజ్‌ చేయడానికి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ విధంగా ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశామని, మరో 34 మందిని అరెస్టు చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరామన్నారు. ఈ తనిఖీల్లో ఈగల్‌ ఎస్పీ నగే్‌షబాబు, ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, అదనపు ఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావుతో పాటు ఆర్‌పీఎఫ్‌, జీఆర్పీ, ఇతర పోలీసు బలగాలు పాల్గొన్నాయి.

Updated Date - Jul 04 , 2025 | 05:35 AM