Diamond in Kurnool District: కూలీ పంట పండింది.. విలువైన వజ్రం దొరికింది.. ధర ఎంతో తెలుసా..
ABN , Publish Date - Jul 04 , 2025 | 09:00 AM
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో ఓ కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఆ వజ్రం లభించడంతో కూలీ పంట పండింది. రోజువారీ కూలీ ఓ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో తనకు మిల మిల మెరిసిపోతున్న వజ్రం కనిపించింది.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో (Kurnool District) వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. ప్రత్యేకంగా జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లోని ప్రజలు వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు. ఒక వజ్రం దొరికితే చాలు జీవితమే మారిపోతుందనే ఆశ వారిది. అందుకే అక్కడ ప్రజలు వర్షపు తొలకరి జల్లులు పడగానే పొలాలను జల్లెడ పడతారు. వజ్రాలు దొరికితే సాధారణ ప్రజలు గంటల వ్యవధిలో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు.
ఒక వజ్రం దొరికితే చాలు తమ కష్టాలు అన్ని తీరుతాయని పొలాల్లో వేట కొనసాగిస్తారు. అక్కడి ప్రజలు మాత్రమే కాదు.. వజ్రాలు దొరికితే కొనుగోలు చేయడానికి వ్యాపారులు సైతం అక్కడ క్యూ కడుతుంటారు. ఆ ప్రాంత ప్రజలే కాదు పొరుగున ఉండే జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు సైతం ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒకవైపు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉంటే.. వజ్రాల వేట కోసం మరోవైపు ప్రజలు గాలిస్తుంటారు.
అయితే.. తాజాగా తుగ్గలి మండలంలోని పెండేకల్లు గ్రామానికి చెందిన రోజువారీ కూలీ ఓ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో తనకు మిల మిల మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. మొదట ఆయన సాధారణంగా ఉన్న రాయి అని అనుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారి దగ్గరికి వచ్చి తనకు భూమిలో దొరికిన రాయిని చూపించాడు. అది రాయి కాదని అత్యంత విలువగల వజ్రమని వ్యాపారి చెప్పాడు. తనకు ఆ వజ్రం రూ.10 లక్షలకి అమ్మాలని వ్యాపారి కోరాడు. కానీ కూలీ మాత్రం ఆ వజ్రాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు. బహిరంగ మార్కెట్లో ఆ వజ్రానికి రూ. 50 లక్షల పైగానే పలుకుతుందని కూలీ ఊహించాడు. వ్యాపారి ఎంతగా ఒత్తిడి తెచ్చినా కూలీ మాత్రం ఆ వజ్రం అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అయితే కొద్దీ గంటల్లోనే వందలాది మంది ఆ వజ్రాన్ని చూడటానికి తరలి వచ్చారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
శాంతి నారాయణకు తెలుగు వర్సిటీ పురస్కారం
For More AP News and Telugu News