YS Sharmila: ఇండోసోల్ కోసం ఊరినే ఖాళీ చేయిస్తారా..
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:41 AM
ఇండోసోల్ కోసం ఊరినే ఖాళీ చేయిస్తారా..! ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ఊరిని చంపి పరిశ్రమను పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు.

గ్రామాన్ని చంపి పరిశ్రమ అంటే ఊరుకునేది లేదు
మూడు పంటలు పండే భూమిలో సోలార్ పార్కా..?: షర్మిల
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘ఇండోసోల్ కోసం ఊరినే ఖాళీ చేయిస్తారా..! ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ఊరిని చంపి పరిశ్రమను పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. గురువారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గత వైసీపీ ప్రభుత్వం షిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే... ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రామ సభలు జరపకుండానే భూములు కేటాయిస్తోంది. మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమలు వద్దంటున్న రైతుల గోడును కూటమి ప్రభుత్వం వినడం లేదు. షిరిడీ సాయి సోలార్‌కు కేటాయించిన కరేడు గ్రామంలోని భూములపై ప్రభుత్వం వెనక్కు తగ్గాలి. రైతులది బతుకు పోరాటం. పచ్చటి పొలాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం. సోలార్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా కరేడు గ్రామ రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అలా అని రైతుల శవాల మీద అక్రమంగా భూ సేకరణ చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు’ అని షర్మిల పేర్కొన్నారు.