Liquor Dump Case: కాకాణికి మరో షాక్
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:58 AM
అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్‌పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

మద్యం డంప్ కేసులో 17 వరకు రిమాండ్
నెల్లూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్‌పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కాకాణికి న్యాయాధికారి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
కేసు నేపథ్యం ఇదీ...: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం విడవూరు, ముత్తుకూరు మడలం పంటపాళెంలలో 69వేల మద్యం సీసాల డంప్‌ను ఎక్సైజ్ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఇద్దరు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకొని కేసును ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో కేసును అంతటితో ముగించారు. ఈ కేసును తిరగదోడాలని పొదలకూరుకు చెందిన కూరపాటి విజయబాబు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ కేసును రీ ఓపెన్ చేస్తే తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తానని ఎక్సైజ్ శాఖకు తెలిపారు. విజయబాబు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో కాకాణిని ఏ-8గా చేర్చారు. పట్టుబడిన 69వేల బాటిళ్లు ఏ షాపు నుంచి, ఏ తేదీన వెళ్లాయనే అంశాలపై ఏ-1 సురేంద్రరెడ్డిని విచారించే క్రమంలో ఈ వ్యవహారంలో కాకాణికి ఉన్న లింకు బయటపడింది. అతని కాల్ లిస్ట్ పరిశీలించగా ఆ రెండు రోజులు కాకాణితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలింది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో మొత్తం 35 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 25 దుకాణాల నుంచి అదనంగా అమ్ముడుపోయినట్లు రికార్డయింది.
ఆ షాపుల్లో సగటు అమ్మకం రోజుకు వెయ్యి బాటిళ్లు అయితే దానికి అదనంగా 1,800 నుంచి 2,000 బాటిళ్లు చొప్పున సుమారు 80 వేల నుంచి లక్ష బాటిళ్లు ఆ రెండు రోజుల్లో డంప్ కింద వెళ్లినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీటిని షాపు కోడ్‌తో డిపో నుంచే స్కాన్ చేసినట్లు భావిస్తున్నారు. దీన్ని నిర్ధారించుకోవడం కోసం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి వివరాలు వస్తే అప్పటి డిపో మేనేజర్‌ను బాధ్యుడ్ని చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విచారణ నిమిత్తం రెండు మూడు రోజుల్లో కాకాణిని ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్‌కు ముందే మద్యం రెడీ
ఓటర్లను ప్రలోభపెట్టడానికి గత ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 10 రోజుల ముందే లక్షలాది మందు బాటిళ్లను వైసీపీ నాయకులు డంప్ చేశారు. ఎన్నికల సమయంలో ఒకటి, రెండు రోజుల్లో భారీ ఎత్తున్న మద్యం విక్రయాలు జరిగాయా అనే కోణంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పరిశీలించే అవకాశం ఉంది. ఈ విషయం నిర్ధారణ అయితే కాకాణి తరహాలో మరికొందరిపై కేసులు తప్పవని భావిస్తున్నారు.