CM Chandrababu: విద్యుత్ రంగంలో ఏఐ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 15 , 2025 | 02:03 PM
వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ విద్యుత్ అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. అత్యంత నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించే ఆలోచన చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇవాళ(శనివారం) సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం - ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జర్గెన్స్, ఏపీ ప్రభుత్వ సీఎస్ కె.విజయానంద్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అతి తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి సాధించి సరఫరా చేయాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని ఉద్ఘాటించారు. ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు చేసి వినియోగాన్ని పెంచగలిగామని తెలిపారు. ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలని మార్గనిర్దేశం చేశారు. అప్పుడే ఇంధన రంగంలో సుస్థిరత సాధ్యం అవుతుందని వివరించారు.
వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ విద్యుత్ అవసరమని చెప్పుకొచ్చారు. అత్యంత నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రయోజనాలు కలిగేలా వ్యవస్థలు ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఏపీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును వేగంగా చేపట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News