Sathya Sai Baba Centenary Celebrations: ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు
ABN , Publish Date - Nov 24 , 2025 | 07:37 AM
భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల (Sathya Sai Baba Centenary Celebrations) సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ (One World One Family Mission) వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచంలోనే సుదీర్ఘంగా జరిగిన సాంస్కృతిక వేడుకలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్.
100 దేశాలను ఒక వేదికపైకి తెచ్చి, కళలు, సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు, సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని ఏకం చేయడం ద్వారా భగవాన్ సత్యసాయి బాబాకు ఘన నివాళి అర్పించింది వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్. ఈ ఉత్సవంలో 100 మంది మానవతావాదులను, 140కి పైగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేట్ సంస్థలను, 45కి పైగా గ్లోబల్ థాట్ లీడర్లను, అలాగే మీడియా, జర్నలిజం, న్యాయవాద రంగాల్లోని అనేకమంది ప్రతిభావంతులను సత్కరించారు.

‘అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు’ అనే భగవాన్ సత్య సాయి బాబా సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోషణ, విద్య, ఆరోగ్య రంగాల్లో అనేక చారిత్రాత్మక సేవా కార్యక్రమాలను మిషన్ ప్రారంభించింది. దేశానికి సేవార్పణగా 126 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత, ప్రైవేట్ 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలో ప్రారంభమై దేశ సేవకు అంకితమయ్యేందుకు సిద్ధంగా ఉంది. అందరికీ సమానమైన, న్యాయమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు. శతజయంతి వేడుకల్లో భాగంగా 60 దేశాల నుంచి వచ్చిన 450 మంది సంగీత విద్వాంసులు సాయంత్రం సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియంలో తమ అద్భుత ప్రదర్శనతో అలరించారు.
ఈ ఉదయం జరిగిన వేడుకల్లో ఫిజీ అధ్యక్షుడు రటు నఖిమా లలా బలావు, ప్రముఖ వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్, అరవింద డిసెల్వా సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా సద్గురు మధుసూదన్ సాయి మాట్లాడుతూ ‘గురువు ఆదేశాలను ఆచరిస్తూ జీవించడమే మనం గురువుకు అందించే ఉత్తమ గురుదక్షిణ.

భగవాన్ సత్య సాయి బాబా నిత్య సత్యం. ఆయనకు జనన మరణాలు లేనే లేవు. భగవాన్ ఎల్లప్పుడూ మన ఇంట, వెంట ఉన్నారు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన అనుగ్రహం లేకపోతే... ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం అసాధ్యం’ అని పేర్కొన్నారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, మతాలు, సంప్రదాయాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక నాయకులు, ఔత్సాహికులు, పండితులు ఈ వేడుకకు హాజరై జ్ఞానాన్ని పంచుకున్నారు. భగవాన్ బాబా సందేశమైన ‘ఏకత్వమే దైవత్వం. పవిత్రతే జ్ఞానం’ అనే విషయాన్ని మళ్లీ గుర్తు చేశారు.

సాయంత్రం సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ప్రపంచ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా 60 దేశాలకు చెందిన సంగీత కళాకారులతో పాటు సత్యసాయి లోక సేవా గురుకులానికి చెందిన 200 మంది విద్యార్థులు కలిసి ప్రదర్శించిన సంగీత కార్యక్రమం నభూతో నభవిష్యత్. 450 మంది ఒకే వేదికపై ఈ స్థాయి ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఈ అత్యద్భుత ప్రదర్శన ద్వారా భగవాన్ సత్యసాయి బాబాకి ఘన నివాళి అర్పించారు. అనంతరం జరిగిన డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ సెలబ్రెషన్స్‌తో ఈ వేడుక ముగిసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News