Supreme Court : జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ!
ABN , Publish Date - Feb 10 , 2025 | 03:38 AM
సాక్షులను నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి..

అమికస్ క్యూరీ హన్సారియా సిఫారసు
అఫిడవిట్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ
సుప్రీం చెప్పినా వాయిదాలేనని అఫిడవిట్‌లో అసంతృప్తి
ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,732 క్రిమినల్ కేసులు పెండింగ్
చాలా మంది నిందితులు కోర్టులకే రావడం లేదు
వరుసగా రెండు సార్లు హాజరుకాకుంటే నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి
మూడేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇవ్వాలి
ఆ దిశగా ఆదేశాలివ్వాలని హన్సారియా వినతి
జగన్‌తోపాటు పలువురు నేతల కేసుల విచారణ ఇక వేగవంతమయ్యే అవకాశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్లో పురోగతే లేదు.. వారి కేసులను ప్రత్యేక కోర్టులు ఉదారంగా వాయిదా వేసేస్తున్నాయి.. సాక్షులను నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి.. దర్యాప్తు, ట్రయల్ విషయాల్లో ప్రజాప్రతినిధుల ప్రభావం అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది’ అని సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు నివేదించారు. కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా పదే పదే వాయిదాలు పడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసుల సత్వర పరిష్కారానికి తాజాగా మార్గదర్శకాలివ్వాలని ఆయన అభ్యర్థించారు. పలువురు ప్రజాప్రతినిధులు కోర్టుల్లో విచారణకు రావడమే లేదని.. వరుసగా రెండుసార్లు హాజరు కాని వారి అరెస్టుకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీచేయాలని తన తాజా అఫిడవిట్‌లో కోరారు. మూడేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను ప్రత్యేక కోర్టులు రోజువారీ విచారించేలా ఆదేశాలివ్వాలని, ఆ కేసుల ట్రయల్ పూర్తయ్యేదాకా ఆ కోర్టులకు ఇతర రెగ్యులర్ కేసుల బాధ్యతలు అప్పగించకుండా చూడాలని సూచించారు.
క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపణ అయిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో దాఖలుచేసిన పిటిషన్‌పై కోర్టుకు సహాయకారి(అమికస్ క్యూరీ)గా హన్సారియాను సుప్రీంకోర్టు నియమించింది. ఆయా కేసుల్లో పురోగతిపై ఆయన రెండ్రోజుల కింద 21వ అఫిడవిట్‌ను దాఖలుచేశారు.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ జరపనుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై 4,732క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హన్సారియా పేర్కొన్నారు. ఇందులో 892 కేసులు ఒక్క 2024లోనే నమోదయ్యాయని తెలిపారు. ప్రజాస్వామిక సంస్కరణల సంఘం(ఏడీఆర్) రిపోర్టును ప్రస్తావిస్తూ.. ప్రస్తుత లోక్‌సభలోని 543 మంది ఎంపీల్లో 170 మందిపై ఐదేళ్లు, అంతకుమించి శిక్షపడే అవకాశమున్న తీవ్ర నేరాభియోగాలు నమోదైనట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్ సహా పలువురు ప్రజాప్రతినిధులపై టీ-హైకోర్టులో 319 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2023 నవంబరు 24నుంచి ప్రజాప్రతినిధులపై దాఖలు చేసిన కేసులకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. అప్పటి నుంచి వాటిపై ఏ తీర్పూ వెలువరించలేదని హైకోర్టు గత జూన్ 4న పేర్కొందని హన్సారియా తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశముందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.
హన్సారియా అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలివీ..
తమపై కేసుల దర్యాప్తు లేదా ట్రయల్‌పై చట్టసభల సభ్యుల పలుకుబడి ప్రభావం ఉంది. ట్రయల్ పూర్తవడాన్ని అనుమతించడం లేదు. సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నా.. హైకోర్టులు పర్యవేక్షిస్తున్నా.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెద్దసంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది దేశ ప్రజాస్వామ్యానికే మచ్చ.
ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులకు ఇతర రెగ్యులర్ కేసుల విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
కొన్ని కేసుల్లో నిందితులు నిర్దిష్ట తేదీల్లో కోర్టుకు హాజరు కావడంలేదు. దీంతో సాక్షుల వాంగ్మూల నమోదు ప్రక్రియ సాగడం లేదు. నిర్ధారిత తేదీల్లో సాక్షులను కోర్టుల్లో హాజరుపరిచేందుకు ప్రాసిక్యూషన్ సమర్థ/సీరియస్ చర్యలు తీసుకోవడం లేదు. సాక్షులకు సమన్లు జారీ చేసి నిర్ణీత తేదీన కోర్టుకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక కోర్టుకు అనుబంధంగా ఉన్న నోడల్ ప్రాసిక్యూషన్. సాక్షులను ప్రవేశపెట్టడంలో సదరు అధికారి విఫలమైతే జిల్లా ఎస్పీ నుంచి లిఖితపూర్వకంగా వివరణ కోరాలి. అవసరమైతే చర్య తీసుకోవాలని కోరాలి.
అరుదైన, అనివార్య కేసుల్లో తప్ప ట్రయల్ కోర్టులు ఈ కేసుల విచారణను వాయిదా వేయరాదని ఆదేశాలిచ్చినా.. సదరు ప్రత్యేక కోర్టులు ఉదారంగా వాయిదాలు మంజూరు చేస్తున్నాయి.
సుమోటో రిట్ పిటిషన్లలో వివిధ హైకోర్టులు ఉత్తర్వులు జారీచేసినా కేసుల ట్రయల్‌లో చెప్పుకోదగిన పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగం వాక్‌స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణను ప్రసాదించింది. సమాచార హక్కు వాటిలో భాగం. చట్టసభల సభ్యులపై కేసుల విచారణ పురోగతి గురించి తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. హైకోర్టు వెబ్‌సైట్‌లో శాశ్వత ట్యాబ్ ఉంటేనే.. మొత్తం సమాచారం సేకరించడానికి అవకాశం ఉంటుంది. చట్టసభల సభ్యుల నేరచరిత, ట్రయల్ పురోగతి.. జాప్యానికి కారణాలు కూడా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఈ వివరాలు హైకోర్టు వెబ్‌సైట్లలో లేవు. ఏ సైట్‌లోనూ ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టుల ఆదేశాలను అప్‌లోడ్ చేయలేదు. ఈ కేసుల విచారణ పురోగతిని హైకోర్టులు నెలవారీగా సమీక్షించాలి. వెబ్‌సైట్‌లో డేటా అప్‌లోడ్ చేయాలి. జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ మాదిరిగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలి.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టులు వాటి ట్రయల్ పూర్తయ్యాకే ఇతర కేసులు చేపట్టాలని ఆదేశాలివ్వాలి. అన్ని జిల్లాల ప్రిన్సిపల్-సెషన్స్ జడ్జీలు.. ప్రజాప్రతినిధులపై కేసుల ట్రయల్ పూర్తయిన తర్వాతే ఆయా కోర్టులకు రెగ్యులర్ వర్క్ కేటాయించాలి.
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 346 (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 309) ప్రకారం.. మూడేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులపై కోర్టులు రోజువారీ విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేయాలి.
అలాగే కోర్టులకు వరుసగా రెండుసార్లు హాజరుకాని ప్రజాప్రతినిధుల అరెస్టుకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీచేయాలి.
నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై 863 కేసులు దాఖలయ్యాయి. వీటిలో ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉన్న కేసులను కొట్టివేయాలి.
లోక్‌సభలో సగం మందిపై క్రిమినల్ కేసులు..
2024లో ఏర్పడిన ప్రస్తుత లోక్‌సభలో సగం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, వాటిలో తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారు 170 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 మంది ఎంపీల్లో 40 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. వారిలో 34 మందిపై తీవ్ర అభియోగాలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో 24 మంది ఎంపీలపై, పశ్చిమ బెంగాల్లో 22 మంది, బిహార్‌లో 21 మంది, తమిళనాడులో 26 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్‌లో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. వారిలో 9 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని హన్సారియా తెలిపారు. తెలంగాణలో 17 మంది పై క్రిమినల్ కేసులు ఉండగా, వారిలో 12 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో 28 కేసులపై విచారణ జరుగుతుండగా.. వాటిలో నాలుగు కేసులపై స్టే ఉందంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నివేదికను ఆయన ప్రస్తావించారు. ఆ సీబీఐ కోర్టులో దాదాపు 140 డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని కూడా హైకోర్టు పేర్కొందన్నారు.
తెలంగాణ హైకోర్టులో 313 పెండింగ్ కేసులు...
తెలంగాణ హైకోర్టులో 172 మంది సిటింగ్ ప్రజాప్రతినిధులు, 26మంది మాజీలపై 313 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హన్సారియా వెల్లడించారు. ‘ఎంపీలు, మాజీ ఎంపీలపై 121, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై 112 కేసులు ఉన్నాయని 2019 ఆగస్టు 25న సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నివేదికలో పేర్కొంది. వీటిలో 31 కేసులపై విచారణ జరుగుతున్నట్లు తెలిపింది. 2000లో చార్జిషీటు దాఖలైన కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, దర్యాప్తు పూర్తి చేసేందుకు, ఆరోపణలను రుజువుచేసేందుకు తమ వద్ద సరైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేవని సీబీఐ ఆవేదన వ్యక్తం చేసింది’ అని హన్సారియా గుర్తుచేశారు.
2023లో సుప్రీం కీలక ఆదేశాలు..
ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న 5వేలకుపైగా కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీం కోర్టు 2023 నవంబరు 9నే కీలక ఆదేశాలు జారీచేసింది. సత్వర పరిష్కారానికి హైకోర్టులు స్వయంగా ట్రయల్‌ను పర్యవేక్షించాలని నిర్దేశించింది. అరుదైన, అనివార్యమైన సందర్భాల్లో తప్ప ప్రత్యేకకోర్టులు కేసుల విచారణను వాయిదా వేయొద్దని ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల ట్రయల్‌కు ప్రాధాన్యమివ్వాలని హైకోర్టులు, జిల్లా జడ్జీలు, ప్రత్యేక కోర్టులకు ఆదేశాలిచ్చింది. పెండింగ్‌లో ఉన్న 5వేలకుపైగా కేసు ల్లో 2వేలకేసులపై ప్రత్యేక కోర్టులు 2023లో నిర్ణయాలు వెలువరించి పరిష్కరించాయని హన్సారియా గత ఏప్రిల్ 22న నివేదించారు. రెండ్రోజుల కిందట తన 21వ నివేదిక/అఫిడవిట్‌ను సమర్పించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి