Minister Mandipalli: ఏపీకి కొత్త పరిశ్రమలు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:42 PM
Minister Mandipalli Rama Prasad Reddy: ఏపీ నుంచి వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటయి ప్రభుత్వంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు.ఈ పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నాయుడుపేటలో ఇవాళ(గురువారం) మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని చెప్పారు. మహిళలకు మూడు సిలిండర్లు, 64 లక్షల మందికి 30వ తేదీన పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి..కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు. శ్రీ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంబంధించి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
త్వరగా షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల : బనగానపల్లెలో షాదీఖానాను పునః నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కోటి రూపాయలు, తాను సొంతంగా రూ.30 లక్షలు నిధులతో షాదీఖానా నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొంతవరకు పనులు జరిగాయని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం షాదీఖానా నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్లక్ష్యం వల్ల షాదీఖానా పూర్తికాలేదని చెప్పారు. ప్రజాధనం భారీగా వృథా అయ్యిందన్నారు. వీలైనంత త్వరగా షాదీఖానా నిర్మాణం పూర్తి చేసి ముస్లిం మైనార్టీలకు అంకితం చేస్తామని తెలిపారు. ఒక ఎకరా 17 సెంట్ల వక్ఫ్ బోర్డు భూమి అన్యాక్రాంతం అయిందన్నారు. పాత బంగ్లా వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.