Minister Nara Lokesh : నాటి అరాచకాలపై దండయాత్ర!
ABN , Publish Date - Jan 27 , 2025 | 03:20 AM
మంత్రి లోకేశ్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు.

లోకేశ్ పాదయాత్రకు రెండేళ్లు
జగన్ నిరంకుశత్వంపై గొంతెత్తిన యువనేత
జనం కన్నీళ్లు తుడుస్తూ.. బాధితులకు భరోసా ఇస్తూ.. 226 రోజుల పాటు ‘యువగళం’
అది సాగిన 97 నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమిదే విజయం
యువత, మహిళలు, వృద్ధులు సహా వివిధ రంగాలకు హామీలు
ముఖ్యంగా ‘మిషన్ సీమ’ డిక్లరేషన్
ఆయన హామీలకే ‘సూపర్ సిక్స్’ రూపం
వాటి అమలుకు ప్రత్యేక యంత్రాంగం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేశ్ పాదయాత్ర చేపట్టి సోమవారంతో రెండేళ్లు ముగుస్తాయి. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యువనేత, ప్రస్తుత ఐటీ, మానవవనరుల మంత్రి లోకేశ్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర సాగించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాదయాత్ర కీలకభూమిక పోషించింది. యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ప్రభావమెంత ఉందో అర్థమవుతోంది. యాత్ర మొదలుపెట్టాక తారకరత్న హఠాన్మరణం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎలాంటి విరామమూ లేకుండా సాగింది. ఎండ, వాన, తుఫాన్లను సైతం లెక్కచేయకుండా లోకేశ్ ముందుకు సాగారు. 226 రోజుల పాదయాత్రలో కోటిన్నర మందిని కలిసి ఉంటారని అంచనా.
అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా..
యువగళానికి అప్పటి పాలకులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేశ్ ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాట్లాడేందుకు నిలబడే స్టూలును కూడా లాగేసుకున్నారు. మైకులు పట్టుకుపోయారు. చివరకు యాత్రను అడ్డుకోవడానికి నిరంకుశంగా జీవోయే తెచ్చారు. అయినా దేనికీ వెరవకుండా ప్రజల గొంతుకనే తన గళంగా వినిపిస్తూ.. వారికి భవిష్యత్‌పై భరోసా ఇస్తూ లోకేశ్ ముందుకు సాగారు. కుప్పం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గానికి చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు చొప్పున మొత్తం 25 కేసులు యువగళం బృందంపై బనాయించారు. ఇందులో మూడు కేసులు లోకేశ్‌పైనే మోపారు. ఎన్ని వేధింపులు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ఆయన బృందం ముందడుగు వేసింది. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజామున 3.30 వరకు ఎదురుచూడడం.,. యువనేతపై వారికున్న అభిమానంతోపాటు అప్పటి జగన్ అరాచక ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పట్టింది. రాయలసీమలో 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర చేశారు. గతంలో ఏ నాయకుడూ రాయలసీమలో ఇంత సుదీర్ఘ యాత్ర చేయలేదు. యువగళం పొడవునా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వచ్చిన పరిశ్రమల విజయగాథలు.. జగన్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేశ్ విసిరిన సెల్ఫీ చాలెంజ్‌లు అప్పటి వైసీపీ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలను నిరాశపరచకుండా ‘సెల్ఫీ విత్ లోకేశ్’ కార్యక్రమంతో ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగారు. 226 రోజులయాత్రలో 3.5 లక్షల మందికిపైగా అభిమానులతో ఫొటోలు దిగారు.
యువగళం హామీల అమలు దిశగా..
పాదయాత్ర సందర్భంగా యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్థులతోపాటు వివిధ రంగాల వారికి లోకేశ్ అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల కోసం కడపలో ‘మిషన్ రాయలసీమ’ పేరుతో డిక్లరేషన్ ప్రకటించారు. ఆ హామీలకు కార్యరూపం ఇస్తూ ఎన్నికల ముందు టీడీపీ కూటమి ‘సూపర్ సిక్స్’ మేనిఫెస్టోలో పొందుపరచింది. ఎన్నికల అనంతరం చంద్రబాబు సారథ్యంలో కొలువుదీరిన ప్రజాప్రభుత్వం.. లోకేశ్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. పగ్గాలు చేపట్టిన తొలిరోజునే మెగా డీఎస్సీ ఫైలుపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్న లోకేశ్ హామీ అమలుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడు నెలల్లోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. లోకేశ్ పాదయాత్ర హామీల అమలుకు ప్రత్యేక యంత్రాంగం సైతం ఏర్పాటైంది.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల