Share News

jobs fraud: నమ్మించి ముంచేస్తున్నారు..

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:14 PM

కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్‌లైన్‌ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర రూపాల్లో సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్‌లో సంభాషించడం జరుగుతోంది.

 jobs fraud: నమ్మించి ముంచేస్తున్నారు..

ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూళ్లు

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

ఆశకి పోయి.. నష్టపోతున్న యువత

డబ్బులతో ఉడాయిస్తున్న మోసగాళ్లు

జిల్లాలో ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి చోట్ల ప్రత్యేక శిక్షణ పొందితే తప్ప సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు రావడం లేదు. కరోనా విపత్తు తర్వాత ఈ సమస్య మరింత జఠిలమైంది. అంతేకాకుండా వ్యవసాయం, చిరు వ్యాపారం, ఇతర రంగాల్లో ఉపాధి పొందే యువకులకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో పక్కదారి పట్టి అయినా ఉద్యోగం సంపాదిస్తే తప్ప ఇబ్బందులు తీరవనే భావనలో కొందరు నిరుద్యోగులు పక్కదారి పడుతున్నారు. దీంతో నిరుద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని మోసపోతున్నారు. నిరుద్యోగుల అవసరాలను కొందరు దళారులు, మోసగాళ్లు, రాజకీయ నాయకులు తమకు ఆదాయ వనరుగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగానే నగదును తీసుకుని నిండా ముంచేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాల పేరిట మాయగాళ్ల వలలో నంద్యాల యువత చిక్కి బలవుతోంది.


నంద్యాల, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్‌లైన్‌ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర రూపాల్లో సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్‌లో సంభాషించడం జరుగుతోంది. అదే చొరవతో ఫోన్‌ నెంబర్‌ తీసుకుని మాయమాటలతో నమ్మించి వారి విద్యార్హతకు తగ్గ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. కనీసం ముఖ పరిచయం కూడా లేకుండా కొందరు నిరుద్యోగులు లక్షలు చెల్లించి మోసపోతున్నారు. బంధువుల ద్వారా పరిచయం కలిగిన వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేయడం మరింత కలవరపెడుతోంది. ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, కొంత పలుకుబడి ఉన్నవాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడటం కలకలం రేపుతోంది. మరీ దారుణంగా ఓ వైద్యుడు సైతం తమ కింద పనిచేస్తున్న ఓ మహిళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేయడంతో చివరికి పోలీసులు సదరు వైద్యుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ తరహా చీటింగ్‌ వ్యవహారాలు నంద్యాల జిల్లాలో ఇటీవల కాలంలో అధికమయ్యాయి.


వందల సంఖ్యలో బాధితులు

జిల్లాలో వివిధ ఉద్యోగాల పేరుతో మోసగాళ్ల నుంచి మోసపోయిన బాధితుల సంఖ్య వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో ఈ తరహా కేసులు అధికంగా వెలుగులోకి వస్తుండటమే ఇందుకు నిదర్శనం. బాధితులు కూడా ఏమాత్రం అలోచన చేయకుండా ఉద్యోగం అనే ఆశతో అప్పులు చేసి మరీ లక్షల రూపాయలను కోల్పోతున్నారు. ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ లేకపోవడం.. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వారిపై పోలీసుల నిర్లక్ష్యం వైఖరితో జిల్లాలో దళారి వ్యవస్థ జోరుగా సాగుతోంది. ఇలాంటి మోసాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


జిల్లాలో జరిగిన సంఘటనలు కొన్ని..

రెండేళ్ల క్రితం మహానంది మండలానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులతో సుమారు రూ.కోటికిపైగా వసూలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత బాధితులు నిలదీస్తే ‘విజయవాడకు మీ పని మీదనే వెళ్తున్నా’ అని చెప్పి ఐపీ నోటీసులు పంపించాడు. నిరుద్యోగులతో పాటు ఓ కానిస్టేబుల్‌ కూడా ఇతడి బాధితుడే. ఐపీ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి నంద్యాలలో దర్జాగా తిరుగుతున్నట్లు సమాచారం.

నంద్యాల పద్మావతి నగరంలోని ఓ వ్యక్తి ఆఫీస్‌ పెట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కల్పిస్తానని నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి ఇటీవలే పరారయ్యాడు.

బేతంచెర్లలో పనిచేస్తున్న ఓ వైద్యుడు 2023లో అక్కడే పనిచేస్తున్న ఓ నర్సు కుమారుడికి వైద్యశాఖలో అటెండర్‌ పోస్టు ఇప్పిస్తానని నమ్మించి రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఏడాదైనా ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2024లో కేసులు నమోదు చేశారు.

గోస్పాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ వ్యక్తికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకపోగా.. డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు. ఈ ఘటనపై తాజాగా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

గత వైసీపీ హయాంలో డోన్‌ మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు అదే మండల పరిధిలోని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.16 లక్షలు తీసుకున్నారు. అయితే రెండేళ్లయినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితులు నిలదీశారు. చివరికి డోన్‌ పట్టణ పోలీసులను బాధితులు ఆశ్రయించడంతో ఏడాది కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నంద్యాలలో కొందరు వ్యక్తులు ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పి.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తమకు కావాల్సిన చోటుకు బదిలీ చేయిస్తామని నమ్మబలికి రూ.లక్షల్లో వసూలు చేశారని బాధిత ఉద్యోగుల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారం జరిగి కూడా నెలలు గడుస్తోంది. అయితే ప్రభుత్వం బదిలీల పక్రియకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో కథ అడ్డం తిరిగింది. బదిలీ పక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బాధిత ఉద్యోగులకు.. ఆ వ్యక్తుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బదిలీ పక్రియ రాగానే చెప్పిన విధంగా బదిలీ చేయిస్తామని హామీ ఇచ్చాడు.

నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ టీస్టాల్‌ నిర్వాహకుడు గతేడాది ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సుమారు 40 మందికి రైల్వేలో ఆర్పీఎఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి సుమారు రూ.2కోట్లు వసూలు చేశాడు. ఆ తర్వాత బాధితులు గుర్తించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆరు నెలల కిందట అక్కడి పోలీసులు బాధితులను నంద్యాల వన్‌టౌన్‌కు పంపించారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ చీటింగ్‌లో టీస్టాల్‌ నిర్వాహకుడితో పాటు నంద్యాలకు చెందిన మరో వ్యక్తి, బీహార్‌కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు తేలింది.

పాణ్యంకు చెందిన ఓ వ్యక్తి అదే మండలానికి చెందిన ఇద్దరు, గడివేములకు చెందిన మరో ఇద్దరితో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రెండేళ్ల కిందట సుమారు రూ.20 లక్షలు తీసుకున్నారు. జరిగిన మోసంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి డబ్బు వెనక్కి రాలేదు. అదేవిధంగా మరో రాజకీయ నాయకుడు సైతం ఉద్యోగాలు, ఇంటి స్థలాల పేరుతో రూ.లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి...

Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు

Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్‌

Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్‌ పొడిగింపు

High Court: ఏబీవీ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

For More AP News and Telugu News

Updated Date - Apr 29 , 2025 | 12:14 PM