Minister Kollu Ravindra: జగన్, పేర్నినానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:18 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పల హరిక కారును వదిలేశామని తెలిపారు. కానీ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చి పోలీసులపై, తెలుగుదేశం నాయకుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని స్థానికులే చెబుతున్నారని అన్నారు. జగన్, పేర్ని నానిలాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర.
రాక్షస మూకలకు రాక్షస ఆలోచనలే వస్తాయని జగన్, పేర్నినాని మరోసారి నిరూపించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మాజీ మంత్రి వివేకా హత్యలో జగన్‌పై ఆరోపణలు వచ్చాయని అన్నారు. వివేకాది గుండెపోటు కాదని.. గొడ్డలి వేటు అని ఆయన కుమార్తె తేల్చిందని గుర్తుచేశారు. జగన్ ప్రతి విషయంలో రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ సభ పెట్టుకోవాలనుకున్నావ్. పెట్టుకో..... అంతే గానీ ఆ సభను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో రక్తం పారిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని జగన్, పేర్నినానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
పేర్నినాని రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
బావ కళ్లల్లో ఆనందం చూడాలని ఆ నాడు మొద్దు శ్రీను పరిటాల రవిని చంపితే... ఇప్పుడు జగన్ రెడ్డి కళల్లో ఆనందం చూడాలని పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) కృష్ణప్రసాద్ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేదని ప్రశ్నించారు. పేర్ని నాని పేదల బియ్యం దోచుకున్నారని ఆరోపించారు. చీకటిలో చంపేయండి... నరికేయండి అని వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్.
పేర్ని నాని ఎవరిని చంపుతారు.. టీడీపీ కార్యకర్తలనా? అని నిలదీశారు. గత వైసీపీ పాలనలో హింస రాజకీయం చేశారని... ఇప్పుడు అలానే చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ సైకో పాలన చూసి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని... అయినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఏపీలో హింసను ప్రేరేపించేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంపై బురద జల్లాలని పేర్ని నాని విశ్వప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ
For More AP News and Telugu News