Devineni Uma: జగన్ అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: దేవినేని
ABN , Publish Date - Jun 20 , 2025 | 08:01 PM
జగన్ అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని.. వారిని ఎందుకు జగన్ రెడ్డి పరామర్శించ లేదని దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మీడియాలో మాట్లాడిన మాటలు తన అసహనాన్ని, అభద్రతాభావాన్ని తెలియజేస్తున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత జగన్ రెడ్డి పరామర్శకు వెళ్లడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌తో, పొదిలిలో అరాచక శక్తులతో జగన్ అల్లర్లు సృష్టించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడారు.
అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారు వారిని ఎందుకు జగన్ రెడ్డి పరామర్శించలేదని దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. నరుకుతాం.. చంపుతాం.. తొక్కిపడేస్తాం.. అని జనాల్ని బెదిరిస్తారా ? ‘ప్రజలకు ఏం సందేశం ఇద్దామని అని ప్రశ్నించారు. 82 కేసులున్న తాము వారానికి నాలుగు రోజులు కోర్టులకు వెళ్తున్నామని తెలిపారు. సీబీఐ, ఈడీలో ముద్దాయిగా ఉండి, బాబాయ్ హత్య కేసులో నీ చుట్టుపక్కన ఉన్న కుటుంబ సభ్యులందరూ భాగస్వాములై ఉండి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నావని మండిపడ్డారు. సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి జగన్ రెడ్డి ఓర్వలేక, తట్టుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు దేవినేని ఉమామహేశ్వర రావు.
జగన్ హయాంలోని ఐదేళ్లలో గంజాయి, డ్రగ్స్, నాసిరకమైన మద్యం, హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, సోషల్ మీడియాలో బూతులు, స్త్రీలపై దాడులు వంటివి చేసి, ఒక తరం భవిష్యత్ పొట్టన పెట్టుకున్నారని దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. ర్యాలీలో వాహనం ఢీకొని ఒకరు, తోపులాటలో ఇంకొకరు చనిపోతే కనీసం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. తల్లికి వందనంపై మొన్నటి వరకు ఎగతాళిగా మాట్లాడిన జగన్ డబ్బులు పడిన తర్వాత మానసిక పరిస్థితిలో ఇబ్బంది కొట్టొచ్చినట్లు కనపడిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు 18 గంటలు కష్టపడుతూ ఏపీని సర్వతోముఖాభివృద్ధి చేస్తుంటే తన వయసు గురించి జగన్, వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు దేవినేని ఉమామహేశ్వర రావు.
కులాల ప్రస్తావన తీసుకొచ్చి మళ్లీ పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నారని దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. సిద్ధం సభల్లో నీ అరాచకాలను చూసే జనం నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారని.. అయినా ఆయనకు సిగ్గు రావడం లేదని విమర్శలు చేశారు. జగన్‌పై ఉన్న కేసులన్నీ బట్టబయలు అవుతున్నాయని.. డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ కోర్టు మెట్లు ఎక్కకుండా డ్రామాలాడుతున్నారని అన్నారు. ఆయన అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా, డ్రామాలు వేసినా ప్రజలు పట్టించుకోరని దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ
ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి
For AndhraPradesh News And Telugu News