YS Sharmila: సింగయ్య మృతికి ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే కారణం: షర్మిల
ABN , Publish Date - Jun 23 , 2025 | 06:03 PM
జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి.. జనాలను చంపకండని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల కోరారు. జగన్‌కి ఇప్పటికైనా మానవత్వం ఉంటే రూ.5, 10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని బాధిత కుటుంబాన్ని అడగాలని వైఎస్ షర్మిల అన్నారు.

తిరుపతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్‌లో చనిపోయిన అతనికి విగ్రహం పెట్టడమే తప్పని.. అలాంటిది ఆ విగ్రహ ప్రారంభానికి వెళ్లి ఇద్దరిని బలి తీసుకుంటారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(సోమవారం) శ్రీకాళహస్తిలో జరిగిన తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడారు. జగన్ క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమని అన్నారు. జగన్‌కి మానవత్వమే లేదని... ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. జగన్‌కి, వైసీపీ నేతలకు మానవత్వం ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేవారని అన్నారు వైఎస్ షర్మిల.
ఇప్పటికైనా జగన్‌కి మానవత్వం ఉంటే రూ.5, 10 కోట్లో సింగయ్య కుటుంబానికి పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలని వైఎస్ షర్మిల కోరారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి.. ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయలు దేరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్పా ప్రజల కోసం కాదని చెప్పారు. జగన్ తనకు డబ్బుంది, బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ జనసమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి.. జనాలను చంపకండని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగయ్యకి ప్రమాదం జరిగిన సమయంలో జగన్ కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల కోరారు.
ఇవి కూడా చదవండి:
దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం
For More Andhrapradesh News and Telugu News