FIR On Ambati: అంబటిపై కేసు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 19 , 2025 | 09:26 AM
FIR On Ambati: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.

పల్నాడు, జూన్ 19: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Former Minister Ambati Rambabu) కేసు నమోదు అయ్యింది. సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర బ్యారికేడ్లను తొలగించి మాజీ మంత్రి నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే బారికేడ్లను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అతని ఫిర్యాదు మేరకు అంబటిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అంబటిపై రెండు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. నిన్న (బుధవారం) జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పల్నాడు బార్డర్ వద్ద అంబటి రెచ్చిపోయారు. జగన్ పల్నాడులోకి ప్రవేశించాక ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తల వాహనలను జిల్లా సరిహద్దులో బారికేడ్లు పెట్టి నిలిపివేశారు పోలీసులు. ఈ సమయంలో అటుగా వస్తున్న అంబటి పోలీసులపై విరుచుకుపడ్డారు. రోడ్డుపై పెట్టిన బారికేడ్లను విసిరిపారేశారు. అంబటితో పాటు ఆయన సోదరుడు కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ బారికేడ్లను తోసిపారేశారు.
అక్కడ ఉన్న పోలీసులను కూడా మీ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి. రోడ్డుపై బారికేడ్లను తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపించారు. అయితే పోలీసులతో అంబటి ప్రవర్తనపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కూడా గుంటూరు జిల్లా పట్టాభిపురం సీఐపై కూడా అంబటి ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంలోనే సీరియస్‌గా ఉన్న పోలీసులు.. నిన్న కూడా రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను విసిరిపారేయడంతో పాటు పోలీసులపై దౌర్జన్యం చేయడంతో అంబటిపై కేసు నమోదు చేశారు. అయితే రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు అంబటిని విచారణకు పిలుస్తారా.. అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. రవి, అరుణ మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
Read latest AP News And Telugu News