Share News

ఎస్సీలకు పదోన్నతిలోనూ వర్గీకరణ అమలు

ABN , Publish Date - Jun 19 , 2025 | 07:18 AM

ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల నిబంధనలు, 2025 నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 18న ఉత్తర్వులు జారీచేసింది.

ఎస్సీలకు పదోన్నతిలోనూ వర్గీకరణ అమలు

  • నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల నిబంధనలు, 2025 నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 18న ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ ఎస్సీలకు పదోన్నతుల్లోనూ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీఓ నెం.7లోని రూల్‌-8 తర్వాత 8(ఏ) కింద ఎస్సీల మూడు గ్రూపులకు పదోన్నతిలో రిజర్వేషన్‌ అమలు తీరును జీఓ నెం.19లో పేర్కొన్నారు. గ్రూప్‌-1లో 12 కులాలకు పదోన్నతులకు 1 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తారు. అదే విధంగా గ్రూప్‌-2 లోని 18 కులాలకు 6.5 శాతం రిజర్వేషన్‌, గ్రూప్‌-3లో 29 కులాలకు 7.5 శాతం రిజర్వేషన్‌ పదోన్నతుల్లో అందించనున్నారు. కేడర్‌ స్ట్రెంత్‌ 5 కంటే ఎక్కువగా ఉద్యోగులు ఉన్న చోట పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారు.


పదోన్నతులకు సంబంధించి 2024-25 ప్యానెల్‌ ఏప్రిల్‌ 18, 2025కు ముందుగా సిద్ధమైనా, కాకపోయినా దానిని తిరిగి సమీక్షించవచ్చు. 2024-25 ప్యానెల్‌ ఏప్రిల్‌ 18, 2025కు ముందు సిద్ధమై... పాక్షికంగా లేక పూర్తిగా అమలు చేసి ఉంటే అది అలాగే కొనసాగిస్తారు. మహిళలకు దక్కాల్సిన 33.33 శాతం రిజర్వేషన్లు ఆయా గ్రూపులు మూడింటికి సమాంతరంగా పదోన్నతుల్లోనూ అమలు చేస్తారు. అంటే ప్రతి గ్రూపులో ఆయా మహిళలకు 33.33 శాతం పదోన్నతుల్లోనూ దక్కేలా చూస్తారు. ఏదైనా ఒక ప్యానెల్‌కు, ఓ గ్రూప్‌నకు సంబంధించిన అర్హులైన అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీని అదే గ్రూపునకు తదుపరి ప్యానెల్‌లో అవకాశమిస్తారు. రెండో ప్యానెల్‌లో కూడా ఆయా గ్రూప్‌నకు సంబంధించిన అర్హులైన అభ్యర్థులు భర్తీ కాకపోతే, మూడో ప్యానెల్‌లో తదుపరి గ్రూపునకు అవకాశం కల్పిస్తారు.

Updated Date - Jun 19 , 2025 | 07:18 AM