Share News

AP Government: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:14 PM

కొత్త రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

AP Government: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Government

అమరావతి: జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ రేషన్ కార్డులని (Ration Cards) పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 60శాతం, ఏపీ ప్రభుత్వం 40శాతం కార్డులను భరిస్తున్నాయని వెల్లడించారు. 4.72 శాతం రేషన్ కార్డు దరఖాస్తులు తిరస్కరించామని చెప్పుకొచ్చారు మంత్రి నాదెండ్ల. నేటి వరకూ ఏపీవ్యాప్తంగా కోటి 40 లక్షల 96 వేల 86 రేషన్ కార్డులు ఉన్నాయని వివరించారు. పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ఈ కార్డులపై ఎక్కడా నాయకుల ఫొటోలు ఉండకూడదని డిజైన్ చేశామని తెలిపారు. కుటుంబసభ్యుల ఫొటోలు మాత్రమే రేషన్ కార్డులో ఉంటాయని.. వీటిని డెబిట్, క్రెడిట్ కార్డు సైజుల్లో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కుటుంబసభ్యుల వివరాలు, కార్డునంబర్ బాగా కనిపించేలా రూపొందించామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.


ఉచితంగా కార్డులు అందిస్తాం..

క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే సెంట్రల్ ఆఫీసులో తెలుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్డులు అన్ని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఆగష్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ఈ కార్డులు అందిస్తామని ప్రకటించారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇస్తారని, రాష్ట్రస్ధాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్డులు పంపిణీ చేస్తారని వెల్లడించారు. 94శాతం మందికి ఈ-కేవైసీ చేశామని తెలిపారు. ఏపీవ్యాప్తంగా 29,786 రేషన్ షాపుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ ఇవ్వాలని ఆదేశించారు. 65 సంవత్సరాల దాటిన వృద్ధులకు ప్రతి నెలా 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య సరకులు హోమ్ డెలివరీ చేస్తామని వెల్లడించారు. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మినహా అన్నిచోట్ల పంపిణీ బాగానే జరుగుతోందని చెప్పుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఇబ్బందులను స్వయంగా తామే వెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.


ఆయిల్ కంపెనీలతో ప్రతి వారం సమీక్షలు

దీపం పథకంలో ఎలాంటి లోపం లేకుండా మూడు ఆయిల్ కంపెనీలతో ప్రతి వారం సమీక్షలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దీపం పథకం రెండో విడతలో భాగంగా నేటి వరకూ 93లక్షల 86వేల మందికి డెలివరీలు పంపిణీ చేశామని తెలిపారు. దీపం-2 పథకాన్ని లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీ లోపు వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై డైరెక్ట్‌గా వినియోగదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి 4,281 మంది లబ్ధిదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా డిజిటల్ వ్యాలెట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ దీపం పథకాన్ని 30శాతం మంది ఉపయోగించుకున్నారని గుర్తుచేశారు. 2,580 మంది లబ్ధిదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.


వారికి డబ్బులు పడలేదు..

దీపం పథకంలో 86వేల మంది లబ్ధిదారుల అకౌంట్లు సక్రమంగా లేకపోవడంతో వారికి డబ్బులు పడలేదని.. వారి వివరాలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 4,516 ట్రాన్సాక్షన్‌లు మాత్రమే ఫెయిల్ అయ్యాయని తెలిపారు. వేర్వేరు బ్యాంకు అకౌంట్లు, ఫోన్ నంబర్లు వేరే ఉండటంతో డబ్బులు పడలేదని చెప్పుకొచ్చారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కింద గ్యాస్ ఏజెన్సీకి మాత్రమే ఆ కూపన్ చెల్లుతుందని... దీంతో వ్యాలెట్‌లోని పైసలు వేరే అవసరాలకు వాడటానికి వీలుండదని స్పష్టం చేశారు. 86 వేల మంది లబ్ధిదారులని గుర్తించడం చాలా కష్టం అయిందని... అయితే అర్హత ఉన్నవారికి నూటికి నూరుశాతం అందజేస్తామని హామీ ఇచ్చారు. చివరి నిమిషంలో గ్యాస్ బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా డబ్బులు పడే అవకాశం లేదని... కాబట్టి ముందే బుక్ చేసుకోవాలని సూచించారు. ఏపీలో అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ఓ అర్హతగా ఉందని తెలిపారు. ప్రస్తుతం డెత్ కేసుల వరకే ఇప్పుడు తొలగిస్తున్నామని.. ఇప్పటివరకూ ఏపీలో 3 లక్షల 56 మంది వరకూ డెత్ కేసులుగా గుర్తించి వాటిని తొలగించామని వివరించారు. వలంటరీగా కార్డులు సరెండర్ చేయమని అడగటంతో 12 నుంచి 13 వందల మంది ముందుకు వచ్చారని పేర్కొన్నారు. అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ఇచ్చిన సిఫార్సులని కమిషనర్ తన దృష్టికి తీసుకువచ్చారని... ఈ విషయంపైనా ఆలోచిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.


ప్రమోషన్ చేస్తే తప్పేంటి: మంత్రి నాదెండ్ల మనోహర్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాబట్టే హరిహర వీరమల్లు సినిమాను తాము ప్రమోట్ చేస్తామని.. అది తమ బాధ్యతని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. తమ సినిమాలను తాము ప్రమోట్ చేయకుండా.. వారి సినిమాలను ప్రమోట్ చేస్తామా? అని ప్రశ్నించారు. సినిమాకు ప్రమోషన్ చేస్తే తప్పేంటని నిలదీశారు. తమ సినిమాని తాము ప్రమోషన్ చేసుకుంటామని స్పష్టం చేశారు. సినిమా ప్రమోషన్‌కి మంత్రుల స్థాయి అనేది అనవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్.. షర్మిలకు షాక్!

పెన్సిల్‌ ముల్లుపై వైట్‌హౌస్‌.. ట్రంప్‌ ప్రశంసలు

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 06:37 AM