Gorantla Butchaiah: వైసీపీ పాలనలో ఏపీ అప్పులమయంగా మారింది: ఎమ్మెల్యే గోరంట్ల
ABN , Publish Date - May 25 , 2025 | 02:38 PM
Gorantla Butchaiah Chowdary: వైసీపీ నేతలపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.

రాజమండ్రి: గత జగన్ పాలనలో ఏపీ అప్పులమయంగా మారిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) విమర్శలు చేశారు. వైసీపీ (YSRCP) నిరంకుశ విధానాలు, కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మహానాడులో చర్చిస్తామని అన్నారు. ఇవాళ(ఆదివారం) రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి రూరల్‌లో వైసీపీ భూకబ్జాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు.
కబ్జాదారుల భరతం పడతామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. 1985లో ఎన్టీఆర్ హయాంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బొమ్మూరులో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక జరిగిందని గుర్తుచేశారు. నాడు తెలుగు విశ్వవిద్యాలయానికి భూముల కేటాయింపులో తాను భాగస్వామిని అయ్యానని స్పష్టం చేశారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తెలుగు విశ్వవిద్యాలయం ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ మొండికేశారని చెప్పుకొచ్చారు. 2014 -19 మధ్య తెలుగు విశ్వవిద్యాలయం కోసం చాలాసార్లు చంద్రబాబుతో మాట్లాడానని తెలిపారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
తన చరిత్ర గురించి తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి అభివృద్ధిలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ మీటింగ్‌లో తాను చేసిన అభివృద్ధి గురించి వివరంగా చెబుతానని అన్నారు. ఇప్పుడు తనను విమర్శించే వారు గత ఏడాది కాలంలో రాజమండ్రి అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు పెట్టుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం తప్ప రాజమండ్రి అభివృద్ధికి వారు ఏం చేశారని నిలదీశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల నాయకత్వంలో ఏపీ అభివృద్ది దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
For More AP News and Telugu News