Democracy Party: అడవిపై పెత్తనం కోసమే ఆదివాసీలపై దమనకాండ
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:56 AM
ఆదివాసీలకు అండగా ఉన్న నక్సల్స్‌ను నిర్మూలించేందుకు ఆపరేషన్ కగార్ వంటి దుర్మార్గపు యుద్ధాన్ని కేంద్రం సొంత ప్రజలపై చేస్తోందని దుయ్యబట్టింది.

కగార్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రజాఉద్యమం నిర్మించాలి
రెండు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ తీర్మానం
అమరావతి/విజయవాడ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అడవిలోని అపారమైన ఖనిజాలను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంపై దమనకాండను ప్రదర్శిస్తోందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివాసీలకు అండగా ఉన్న నక్సల్స్‌ను నిర్మూలించేందుకు ఆపరేషన్ కగార్ వంటి దుర్మార్గపు యుద్ధాన్ని కేంద్రం సొంత ప్రజలపై చేస్తోందని దుయ్యబట్టింది. ఆపరేషన్ కగార్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు విప్లవ పార్టీల విలీన సభ తీర్మానించింది. ఆదివారం విజయవాడలోని ఎంబీ భవన్‌లో రెండు సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ పార్టీల విలీన సభను నిర్వహించారు. తొలుత నగరంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం, గోదావరిలోయ, దండకారణ్యం, బస్తర్ ఉద్యమాల్లో మరణించిన నేతలకు నివాళులర్పించారు. సభలో మూడు కీలక తీర్మానాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, కేంద్ర కమిటీ సభ్యులుగా అమరులైన చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు, రాయల సుభాశ్ చంద్రబోస్(రవన్న),మాదాల నారాయణస్వామిల వర్ధంతి సభలను నిర్వహించాలని, ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా బలమైనప్రజా ఉద్యమాలు నిర్మించాలని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్, ఇతర హామీల అమలుకోసం ప్రజాపోరాటాలు నిర్మించాలని తీర్మానించారు.