Anantapur Hospital ON Patient Neglect: ఆస్పత్రి కాదు.. అరణ్యం..!
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:25 AM
: అనంతపురం సర్వజనాస్పత్రి ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కు. అలాంటి వైద్యశాలకు ఎంతో మంది నిత్యం ప్రాణాపాయ పరిస్థితిలో వస్తుంటారు. ఆ సమయంలో అత్యవసరంగా సరైన వైద్యం అందితే ఎంతో మంది బతుకుతారు.
ఆస్పత్రి కాదు.. అరణ్యం..!
అత్యవసర విభాగంలోనూ అందని వైద్యం
ప్రాణాపాయంలో ఉన్నవారిని పట్టించుకునే వారు కరువు
వీల్ చైర్లు, స్ట్రెచర్లు కుటుంబీకులు తోసుకోవాల్సిందే..
కనిపించని సెక్యూరిటీ
కాన్పుల వార్డులో అన్నీ గర్భిణుల వెంటవచ్చిన వారు చేసుకోవాల్సిందే..
స్కానింగ్, బ్లడ్‌బ్యాంకు కేంద్రాలకు తలుపులేసుకుని నిద్రలో సిబ్బంది
అనంత నగర పరిధిలోని రుద్రంపేటకు చెందిన కుమారిపై ఆమె తమ్ముడు గొడవపడి కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్రరక్తస్రావమై, ప్రాణాపాయంలో ఉన్న కుమారిని మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సర్వజన ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారు. కుమారిని డాక్టర్లు పరీక్షించి ఆల్ర్టాసౌండ్, సిటీ స్కానింగ్‌లు చేయించుకురావాలని రసీదులు రాసిచ్చారు. స్కానింగ్‌కు తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఎమర్జెన్సీలోనే కుమారి హాహాకారాలు చేస్తూ పడిపోయింది. దీంతో కుమారిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని ఆమె భర్త నాగరాజు, కుమార్తె వెన్నెల స్కానింగ్‌కు తీసుకెళ్లారు. స్కానింగ్‌లు పూర్తిచేసుకుని తిరిగి ఎమర్జెన్సీకి వచ్చే సరికి దాదాపు రెండుగంటలు దాటింది.
అనంతపురం నగరానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రికి వచ్చాడు. అతడి వెంట వచ్చినవారు మద్యం మత్తులో జోగుతున్నారు. తోచినట్లుగా మాట్లాడుతున్నారు. వివరాలు సరిగా చెప్పట్లేదు. వారి తీరుతో వైద్యసిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ఆ సమయంలో మత్తులో ఉన్నవారిని బయటకు పంపాల్సిన సెక్యూరిటీ సిబ్బంది కనుచూపు మేరలో కనిపించలేదు. దీంతో వైద్య సిబ్బంది పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
అనంతపురం వైద్యం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అనంతపురం సర్వజనాస్పత్రి (Anantapur Hospital) ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కు. అలాంటి వైద్యశాలకు ఎంతో మంది నిత్యం ప్రాణాపాయ పరిస్థితిలో వస్తుంటారు. ఆ సమయంలో అత్యవసరంగా సరైన వైద్యం అందితే ఎంతో మంది బతుకుతారు. మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకంతోనే బాధితులు అర్ధరాత్రి సర్వజనాస్పత్రికి వస్తుంటారు. వైద్యశాలలో మాత్రం పట్టించుకునేవారు కరువవుతున్నారు. కాదు.. కాదు.. కనిపించరు కూడా. మంగళవారం అర్ధరాత్రి ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాణాపాయ పరిస్థితుల్లో అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన వారిని దించుకునే ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలు లేరు. క్షతగాత్రుల బంధువులే దింపాల్సిందే.
వారే వీల్‌చైర్, స్ర్టెచర్ తెచ్చుకుని, వాటిపై ఉంచుకుని ఎమర్జెన్సీ వార్డులోకి తోసుకెళ్తూ కనిపించారు. అక్కడ వైద్యుడు లేరు. హౌస్ సర్జన్లు మాత్రమే ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి ఎలాంటి వైద్యం చేయాలో అర్థంకాక వారు దిక్కులు చూస్తున్నారు. ఏమీ పాలుపోక స్కానింగ్‌లు, రక్త పరీక్షలకు రాసి పంపారు. బాధితుడిని తరలించేందుకు సిబ్బంది లేరు. ఉన్నా.. పట్టించుకోరు. దీతో మళ్లీ కుటుంబ సభ్యులే వీల్‌చైర్‌లో, స్ర్టెచర్‌లో దారిలో కనిపించిన వారిని అడుగుతూ స్కానింగ్ కేంద్రానికి తరలించారు. అక్కడ చేయించారు. తర్వాత రక్త పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నమూనాలు ఇచ్చాక.. ఫలితాల కోసం గంటల తరబడి వేచిచూశారు. చివరికి ఫలితాలు తీసుకుని, ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లారు. అప్పటికే రెండు గంటలు దాటింది. అప్పుడు వైద్యులు పరీక్షించి, తాపీగా వార్డుకు తరలించారు. ఈ సమయంలో ప్రాణంపోతే ఎవరిది బాధ్యత? ప్రాణాపాయ పరిస్థితుల్లో వచ్చిన వారికి వెంటనే వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడాలన్న కనీస బాధ్యతను డాక్టర్లు విస్మరిస్తుండడం శోచనీయం.
అన్నీ కుటుంబ సభ్యులే చూసుకోవాలి..
కాన్పుల వార్డులో ఇబ్బందులు వేరేలా ఉన్నాయి. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భవతులు కూడా ఇక్కడ తిప్పలు పడాల్సిందే. రక్తపరీక్షలను కుటుంబ సభ్యులే చేయించుకు రావాల్సిందే. రక్త నామూనాలు సేకరించేందుకు ల్యాబ్‌కెళ్లి గాజు ట్యూబులను వారే తెచ్చుకోవాలి. తిరిగి వాటిని ఇచ్చి రావాలి కూడా. సులువుగా కాన్పులు జరగడానికి, బీపీ కంట్రోల్ ఉంచడానికి, ఇతర సమస్యలకు అవసరమైన మందులను బయటికెళ్లి కొనుక్కొచ్చుకోవాల్సిందే.
తలుపులేసుకుని నిద్రలోకి..
అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాలంటే క్రాస్‌మ్యాచింగ్ చేయాలి. బ్లడ్‌బ్యాంకు, స్కానింగ్ కేంద్రాలకు వెళ్తే అక్కడి సిబ్బంది తలుపులు వేసుకుని నిద్రలోకి జారుకుంటున్నారు. గట్టిగా అరిచినా వారు నిద్రమత్తులో నుంచి బయటకు రావడంలేదు. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు, సెక్యూరిటీ సిబ్బంది వంతులవారీగా పనిచేస్తున్నారు. ఒక్కోసారి మూకుమ్మడిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
చికిత్స చేయట్లేదు: శీను, బేతంచెర్ల, నంద్యాల జిల్లా
రామాంజనేయులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు పట్టించుకోవట్లేదు. వెంటనే వైద్యం చేయట్లేదు. స్కానింగ్‌లు రాసిస్తే మేమే స్ర్టెచర్‌లో తోసుకెళ్లి, చేయించుకుని వచ్చాం. ట్రీట్‌మెంట్ చేయమంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోకుంటే ఎలా?
సూదిమందు లేదంట: షబానా, తాడిపత్రి
మా చెల్లెలు షకిలాను కాన్పునకు తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి, మాత్రలు ఇచ్చారు. బీపీ ఎక్కువగా ఉందనీ, ఇంజక్షన్ వేయాలన్నారు. ఆస్పత్రిలో సూదిమందులేదనీ, బయటికెళ్లి తీసుకురావాలని రాసిచ్చారు. మా ఇంట్లోవాళ్లకి చీటీ ఇచ్చి పంపా. అర్ధరాత్రి ఎక్కడ దొరుకుతుందో.. ఏమో?
ఎక్కడిస్తారో తెలియదు: వెంకటమ్మ, కుటాగుళ్ల, కదిరి
నా కూతురు లావణ్యను ప్రసవానికి తీసుకొచ్చా. డాక్టర్లు సిజేరియన్ చేయాలన్నారు. రక్తపరీక్షలు చేయాలనీ, గాజు ట్యూబ్‌లు తెచ్చుకోవాలని చీటీ రాసిచ్చారు. ఎక్కడిస్తారో తెలియక అంతా తిరిగాను. మళ్లీ వార్డుకెళ్లి డాక్టర్లను అడిగితే పైన 19వ నంబరు అనిచెప్పారు. అప్పుడు వెళ్లి.. తెచ్చుకున్నా.
ఈ వార్తలు కూడా చదవండి
పసుపు సాగులో కొత్త పద్ధతులు... అంతర పంటగా బొప్పాయి
For More Andhra Pradesh News and Telugu News..