Amaravati Financial District Laid Foundation: అమరావతిలో.. ఆర్థిక నగరం
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచీ సహకరించాలనే ఉద్దేశంతోనే ఒకేరోజున 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు......
బాబు సంకల్పం.. మోదీ సహకారం.. ఒకే రోజు 15 ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన
ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమం
అమరావతి పునఃప్రారంభం బ్రహ్మయజ్ఞం
చంద్రబాబు సారథ్యంలో బలమైన రాజధాని
అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో బ్యాంకింగ్
రాష్ట్ర ఆలోచనల సాకారానికి చేయూతనివ్వాలి
నాడు హైదరాబాద్‌లో, నేడు అమరావతిలో చంద్రబాబు చేతుల మీదుగానే ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్’
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభించడం బ్రహ్మయజ్ఞం లాంటిది. దానిని చంద్రబాబు మొదలుపెట్టగా.. ప్రధాని మోదీ వచ్చి మద్దతు తెలిపారు. సమగ్ర ప్రణాళికతో నూతన రాజధాని నిర్మించడం సామాన్యమైన పని కాదు.
ఆంధ్రప్రదేశ్ గురించి నేను ప్రధాని వద్దకు ఎప్పుడు వెళ్లినా.. రాష్ట్రంలోని ఏ ప్రాంతమూ వెనుకబడకూడదని చెబుతున్నారు. విభజన తర్వాత ముందుకు వేగంగా ముందుకెళ్లాల్సిన రాష్ట్రమని, ఎంతో సహకరించాలని ఆదేశాలిస్తున్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ అన్నపూర్ణి సీరియ్‌సగా తీసుకుని ఏడాదిన్నరలో అమరావతిలోని ప్లానిటోరియం నిర్మాణాన్ని పూర్తి చేయాలి. రాజధానిలో మేజర్ ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి ప్లానిటోరియం నిర్వహణలోకి రావాలి. ఇక్కడున్న పిల్లలందరూ వెళ్లి చూడాలి. ఈ ప్రాజెక్టు బ్యాంకుల కంటే ఎక్కువ.
-నిర్మలా సీతారామన్

గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచీ సహకరించాలనే ఉద్దేశంతోనే ఒకేరోజున 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమమని తెలిపారు. ‘అమరావతిలాంటి భవిష్యత్ రాజధాని ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు.. దానికొక ఫైనాన్షియల్ (బ్యాంకింగ్) డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఇక్కడ కొలువుతీరుతున్నాయి’ అని చెప్పారు. ఆయా బ్యాంకులు, సంస్థల సీఎండీలందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అమరావతి రాజధానిలోని ఏపీసీఆర్‌డీఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకులు-బీమా సంస్థల ప్రాంతీయ కార్యాలయాలకు శంకుస్థాపన అనంతరం ఆమె ప్రసంగించారు. దేశంలో ప్రప్రథమంగా ఆర్థిక జిల్లాను హైదరాబాద్‌లో నిర్మించింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబేనని నిర్మల గుర్తు చేశారు. మళ్లీ ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయనకే లభించిందని చెప్పారు. నాడు హైదరాబాద్‌లో అమలు చేసిన కార్యక్రమాలు నేడు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చి ఆర్థిక ఫలాలు అందిస్తున్నాయని.. చంద్రబాబుకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఎంతో క్లిష్టమైన ఈ బాధ్యతను ఆయన తన భుజాలపై మోసి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దృఢమైన రాజధాని అమరావతి రూపంలో ఏర్పడుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. నిర్మలా సీతారామన్ ఇంకా ఏం చెప్పారంటే..

ఏపీ శక్తికి అనుగుణంగా బ్యాంకింగ్
ఆంధ్రప్రదేశ్ శక్తి, సామర్థ్యాలను అర్థం చేసుకుని.. వాటికనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉండాలి. ప్రాంతీయ ప్రధాన కార్యాలయాల ఏర్పాటు ఒక్కటే చాలదు. ఈ రాజధాని నిర్మాణంలో రైతులు చాలా పెద్ద త్యాగం చేశారు. అది మనం మరచిపోకూడదు. కొత్త అమరావతి అంటే మనకు గుర్తుకొచ్చేది రైతులే. రైతులకు సమస్య లేకుండా బ్యాంకింగ్, బీమా సదుపాయాలు అందించడం బ్యాంకింగ్, బీమా కంపెనీల బాధ్యత. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే రూ.లక్ష రుణాలకే పరిమితం కాకూడదు. రాయలసీమలోని తొమ్మిది జిల్లాల్లో ఉద్యాన హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చెబుతున్నారు. దాని ప్రభావం ఆ ప్రాంతానికే కాకుండా అన్ని జిల్లాల్లో ఉంటుంది. ఈ సమయంలో బ్యాంకులు తాజాగా ఆలోచన చేయాలి. కూరగాయలు, పండ్లకు ఏపీని హబ్‌గా చేయాలనేది సీఎం ఆలోచన. దానికి మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకర్లు సహకరించాలి. ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన’లో పేదలకు ఉచిత బియ్యం అందుతున్నాయి. అది చాలదు. ప్రధాని పోషకాహార భద్రత గురించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యంతో పాటు పప్పులు, కాయగూరలు, పండ్లు ప్రజలకు అవసరం. వాటిని ఆంధ్రలో రాయలసీమలాంటి తొమ్మిది జిల్లాలు పండించినప్పుడు.. కావలసిన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, నాణ్యమైన విత్తనాలు, ప్యాకేజింగ్ ఉండాలి. ఒక రాష్ట్రం రైతుల సంక్షేమం కోసం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అండదండగా ఉండాలి.
బీమా లాభాలు అమరావతికి అందాలి
‘బీమా సఖి’ కార్యక్రమాన్ని రెండేళ్ల కిందట హరియాణాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. బీమా కంపెనీలకు ఏజెంట్లుగా మహిళలను గ్రామగ్రామానికీ పంపించారు. ఒకే రోజున మూడు లక్షల మంది చేరారు. ఏడాదిలో దాని ఫలితం అద్భుతం. బీమా కవరేజ్ జరుగుతోంది. మహిళలకు ఆదాయమూ వస్తోంది. అలాంటి లాభాలను బ్యాంకులు అమరావతికి అందించాలి.
ఐటీఐ ద్వారా ఏఐ శిక్షణ కేంద్రాలు
చంద్రబాబు క్వాంటమ్ హబ్, ఏఐకోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఏఐ విస్తరణకు ‘ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్ (ఐటీఐ)’కి కేంద్ర బడ్జెట్ ద్వారా నిధులు అందుతున్నాయి. ఐటీఐ ద్వారా ఏఐ శిక్షణ కేం ద్రాలను సంకల్పించాం. పైలట్ ప్రాజెక్టుగా ఏపీలో రెం డు జిల్లాల్లో శ్రీకారం చుట్టబోతున్నాం. అక్కడ యువకులు శిక్షణ పొందితే ఉద్యోగాలు వెంటనే వస్తాయి.
కెమిస్ట్రీ, ఫిజిక్స్‌కు ఏపీలో ప్రాధాన్యమివ్వాలి..
కోర్ సైన్సె్‌సకు ప్రాధాన్యం గురించి మంత్రి లోకేశ్ అడిగారు. స్కూలు పిల్లల సమయం నుంచే ఆస్ట్రోఫిజిక్స్ గురించి మాట్లాడతాం. నా కుటుంబంలో మూడు నాలుగు తరాలు ఇదే విషయం చెప్పేవాళ్లు. ఒకప్పుడు బెనార్‌సకు వెళ్లి సైన్స్ చదవాలని ఉండేది. ఆంధ్ర నుంచి ఆ యూనివర్సిటీలో ఎక్కువ మంది సైన్స్ విద్యార్థులుండేవారు. సైన్స్‌కు పేరు ప్రఖ్యాతలు గడించిన ప్రాంతం ఆంధ్ర. ఇప్పుడు ఐటీలో చాలా దృష్టి పెట్టి ముందుకుపోతోంది. అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో పేరుగాంచిన వాళ్లు ఇక్కడ లేరు. వాటికి కూడా మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌తో ఎంవోయూ చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు. ఆస్ట్రోఫిజిక్స్‌పై ఎంతగానో పనిచేస్తున్న డైరెక్టర్ అన్నపూర్ణి వచ్చి సీఎంతో ఒప్పందం చేసుకున్నారంటే అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. లద్దాఖ్‌కు ఎవరైనా కొత్తగా వెళ్తే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని అందరూ చెబుతారు. అక్కడ ప్రాణవాయువు తక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ఇంకా లోతుగా వెళ్తే హ్యాండ్‌లే అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ గాఢాంధకారం ఉంటుంది. ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రాన్ని చూసేంత చీకటి ఉంటుంది. బైనాక్యులర్స్ అవసరం లేదు. మొత్తం పాలపుంత కనిపిస్తుంది. అక్కడ సంస్థ ఏర్పాటు చేసి అన్నపూర్ణి నడుపుతున్నారు. నేనోసారి వెళ్లి చూశాను. ఆ అనుభూతి మరిచిపోలేనిది. ఆ పాలపుంతను రియల్‌టైంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో చూపించడానికి ప్లానిటోరియం ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదటిది మైసూరులో ఏర్పాటు చేశారు. దానిని కన్నడ విద్యార్థులు సందర్శిస్తూ సైన్స్‌లో ఎంతగానో ముందుకెళ్తున్నారు. దేశంలో చాలా ప్లానిటోరియంలు ఉన్నాయి. అయితే వాళ్లు ఆకాశాన్ని రికార్డు చేసి పెడతారు. అది సందర్శకులకు చూపిస్తారు. ఇక్కడ టెక్నాలజీని వినియోగించి రియల్ టైంలో అబ్జర్వేటరీ ద్వారా ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం కూర్చుని చూడొచ్చు. ఇలాంటి సైన్స్ నేర్పించి పిల్లలకు చూపించి వాళ్లలో ఆకాంక్ష ఏర్పరచగలిగితే ఇప్పుడున్న నైపుణ్యం కంటే ఎంతగానో పెరుగుతుంది. దీని ప్రాముఖ్యాన్ని సీఎం చంద్రబాబు అర్థం చేసుకుని వెంటనే భూమి ఇచ్చారు.
సైన్స్ ఆంధ్రలో ఎంత ముఖ్యమో...
సైన్స్ ఆంధ్రలో ఎంత ముఖ్యమో చెప్పాలంటే.. ఒకసారి నేను విద్యార్థులతో కలిసి టిబెట్‌కు వెళ్లాను. అక్కడ బౌద్ధ ప్రదేశాలు చూపించాం. కష్టమైనా అనుమతి తీసుకున్నాం. రసాయన శాస్త్రంలో బౌద్ధాచార్యుడు ఆచార్య నాగార్జునుడి నైపుణ్యం గురించి అక్కడి బౌద్ధులు చెప్పారు. నేటికీ మాట్లాడతారు. ఆచార్య నాగార్జునుడు ఆంధ్ర నుంచే టిబెట్‌కు వెళ్లి బౌద్ధ మతాన్ని విస్తరించారు. ఆ స్ఫూర్తితో ఏపీ గురించి ఎక్కడికెళ్లినా చెప్పుకొనేలా రాష్ట్రాన్ని నిర్మించాలి.
అరుదైన ఖనిజాలపై దృష్టిపెట్టాలి..
ఎన్నో మెటీరియల్స్ చైనా నుంచి వస్తున్నాయి. అరుదైన భూమి ఖనిజాలు రావడానికి మాత్రం ఎ న్నో ఆటంకాలు. అలాంటి ఖనిజాలను ఇక్కడ తయారు చేయాలంటే శాస్త్ర, సాంకేతిక రంగంలో దే శం మరింత ముందుకెళ్లాలి. ఆధునిక అమరావతిలో అంత ఆధునికంగా సైన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అ ప్పుడే మన పిల్లలు సైన్స్‌లో మాస్టర్ క్లాస్ చేస్తారు.
శంకుస్థాపన జరిగింది వీటికే...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఏపీ గ్రామీణ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్.. ఎల్‌ఐసీ, ఎన్‌ఐఏసీఎల్.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Cabinet Approves Key Decisions: అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే
Cabinet Approves Second Phase of Land Pooling: 7 గ్రామాలు.. 16,666 ఎకరాలు