Share News

సీఎం రేవంత్‌కు దమ్ముంటే బామ్మర్దిపై విచారణ చేపట్టాలి: కేటీఆర్

ABN , Publish Date - Apr 12 , 2026 | 02:49 PM

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం క్యాతనపల్లిలో నీచ రాజకీయం చేశారంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం మంచిర్యాలలో జిల్లా పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు.

సీఎం రేవంత్‌కు దమ్ముంటే బామ్మర్దిపై విచారణ చేపట్టాలి: కేటీఆర్
BRS Working President KTR

మంచిర్యాల, ఏప్రిల్12: మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం క్యాతనపల్లిలో నీచ రాజకీయం చేశారంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం మంచిర్యాలలో జిల్లా పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ అహం దెబ్బతిందన్నారు. దాడులు, అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూశారని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.


బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఇంత చేసినా.. ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్-సీపీఐ నేతలకు అభినందనలు తెలిపారు. వివేక్ ఫోన్ చేసి అడుక్కుంటే మున్సిపాలిటీని వదిలేసే వాళ్ళమని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు.


ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి తక్కువ స్థాయి మాటలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు.100 రోజుల్లో ఆరు గ్యారంటీలు ఏమయ్యాయో చెప్పాలంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిని సీఎం రేవంత్ రెడ్డి బావమరిది నడుపుతున్నాడని ఆరోపించారు. సింగరేణిలో ఎవరైనా టెండర్ వేయాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారని తెలిపారు. మాట వినని కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఏసీబీ విచారణ కాదు.. సీఎం రేవంత్‌కు దమ్ముంటే బామ్మర్దిపై విచారణ చేపట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు.


సింగరేణి మెడికల్ బోర్డు వెంటనే పెట్టాలని.. లేకుంటే ఆ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతి బొగ్గు గనిలో అగ్గి పుట్టిస్తామన్నారు. కత్తి కాంగ్రెస్‌కు ఇచ్చి మమ్మల్ని కోట్లాడమంటే ఎలా అని ప్రజలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ ఆయా నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ చెప్పినట్టుగానే భస్మాసుర హస్తం అయిందని గుర్తు చేశారు. సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ప్రకటించారు.


సింగరేణిలో సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తుంటే బీజేపీ నేతలు మాత్రం స్పందించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. సీఎం బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకాల టెండర్లు వస్తున్నాయని చెప్పారు. బీజేపీ ఎంపీలకు రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారని విమర్శించారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ నడుస్తుందని.. ప్రధాని మోదీ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.


కాళేశ్వరం వల్ల దేశంలో అధిక స్థాయిలో వరి పండిందన్నారు. దీనిపై కాళేశ్వరంను కూలేశ్వరం అన్న సన్నాసులు సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా విమర్శించారు. నేడు వ్యవసాయం దెబ్బ తిందని.. ప్రాణహిత-ప్రాజెక్టుపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. డీపీఆర్ కాలేదు.. మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదు.. బడ్జెట్‌లో కేవలం రూ.54 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీ చాలని నిధులతో ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. సింగరేణిలో మళ్ళీ టీబీజీకేఎస్‌ను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి కేటీఆర్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్రెడిబిలిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు: మంత్రి సత్యకుమార్

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర: లెఫ్టినెంట్ గవర్నర్

For More TG News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 03:04 PM