సెంచరీని మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం చేస్తున్నా: సంజు శాంసన్
ABN , Publish Date - Apr 12 , 2026 | 02:45 PM
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం తన సెంచరీపై సంజు మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత మూడు మ్యాచుల్లో విఫలమవుతూ వస్తోన్న స్టార్ బ్యాటర్ సంజు శాంసన్(115*) సెంచరీతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కీలక సమయంలో జట్టుకు విజయాన్ని అందించిన సంజు.. తన సెంచరీపై మాట్లాడాడు. తనపై నమ్మకం ఉంచి అవకాశాలిచ్చిన ఫ్రాంచైజీకి ధన్యవాదాలు తెలిపాడు. తన సెంచరీని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు.
‘ఫ్రాంచైజీ నాపై నమ్మకం ఉంచి భారీ మొత్తం వెచ్చించి మరీ జట్టులోకి తీసుకుంది. మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిన బాధ్యత నాపై ఉంది. గత మూడు మ్యాచుల్లోనూ విఫలమైనా సరే.. ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు సెంచరీతో ఆ భారం కాస్త దిగింది. మేం కూడా టోర్నీ రేసులో ఉన్నామని బలంగా చెప్పగలను. కొత్త ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ.. మంచి ఆరంభం లేకపోతే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. కానీ మేనేజ్మెంట్ పూర్తి మద్దతు ఇచ్చింది. నాకు చెన్నై మరో హోమ్ లాంటిది. మొదట్లో విఫలమైనా.. దాని నుంచి తేరుకుని కమ్‌బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. అందుకోసం చాలా శ్రమించా. నా గేమ్ ప్లాన్ మార్చుకున్నా. ఇప్పుడు నా వయసు 31 ఏళ్లు. చాలాకాలం ఆటతో మమేకం కావాల్సి ఉంటుంది. కాబట్టి నా బలం ఏంటో గుర్తించి.. మానసికంగానూ మెరుగయ్యేందుకు శ్రమించా’ అని సంజు తెలిపాడు.
సవాళ్లు ఉంటాయి..
‘సీఎస్కే తరఫున తొలి సెంచరీని నమోదు చేయడం ఆనందంగా ఉంది. అయితే దీనిని ఓ వ్యక్తికి అంకితం చేస్తున్నా. నేను విఫలమైనా సరే.. వెన్నంటే ఉంటూ ప్రోత్సహించిన ప్రధాన కోచ్ ఫ్లెమింగ్‌కే నా సెంచరీని డెడికేట్ చేస్తున్నా. నేను కూడా ఓ జట్టును ఐదేళ్లపాటు నడిపించా. ఆ కష్టం నాకూ తెలుసు. మానసికంగా చాలా సవాళ్లు ఉంటాయి. ఓడిపోయిన ప్రతిసారీ బయట నుంచి వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టం. అందుకే ఈ సెంచరీని మా కోచ్‌కు అంకితం చేస్తున్నా’ అని సంజు వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
సంజు కాదు.. విజయానికి కారణం వాళ్లే: రుతురాజ్
అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్