రాజధాని అంశంలో జగన్ ఆటలకు చెక్ పడింది: ఎమ్మెల్యే సోమిరెడ్డి..
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:48 PM
అద్భుత రాజధానిగా అమరావతి నిర్మాణంతో సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ చాటడం ఖాయమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించడం శుభపరిణామం అని చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ లోక్ సభ ఆమోదం తెలపడం సంతోషకర పరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రమంతా గర్వించేలా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అద్భుత రాజధాని నిర్మాణంతో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన బ్రాండ్ చాటడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి కోసం 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగాన్ని రాష్ట్రం ఎప్పుడూ మరచిపోదని అన్నారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి డ్రామాలకు ఇప్పుడు చెక్ పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు రాజధానులే ఉండవంటూ ఈరోజు మరో కొత్త రాగం అందుకున్నారని ఆయనపై నిప్పులు చెరిగారు సోమిరెడ్డి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో పర్యటించిన సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
శుభపరిణామం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ..'అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించడం శుభపరిణామం. దేశంలోనే మొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అంగీకరించి 34 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల మేలును రాష్ట్రం ఎప్పటికీ మరిచిపోదు. అమరావతికి చట్టబద్ధత లభించడంతో భూముల విలువ పెరిగి, పెట్టుబడులు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరందుకుంటుంది. జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన గందరగోళ వాతావరణానికి నేటితో తెరపడింది. 2019 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలో తాను ఇల్లు కట్టుకుంటున్నానని ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు.
సీఎం ఎక్కడుంటే అదే రాజధానా?
సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని కూడా జగన్ సెలవిచ్చారు.. అంటే కర్ణాటక రాష్ట్రం యలహంకలోని 29 ఎకరాల ప్యాలెస్‌లో ఆయన ఉంటే అదే రాజధానిగా భావించాలేమో. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉంటే అదీ రాజధాని అనుకోవాలేమో. ఆయన బాత్రూమ్‌లో ఉంటే బాత్రూమ్, బెడ్రూమ్‌లో ఉంటే బెడ్రూమ్ రాజధాని అవుతుందా?. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదంటూ ఈరోజు మరో కొత్త రాగం అందుకున్నారు. ఎప్పుడు ఏ మాట్లాడుతారో తెలియదు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని పరిస్థితి. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించడం లేదని పార్లమెంట్ బయట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. కానీ, సభ లోపలికి వెళ్లాక బిల్లును వ్యతిరేకిస్తున్నామని బయటకొస్తారు. రాష్ట్రానికి రాజధాని అనేది ఆషామాషీ విషయం కాదు. అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. ఇలాంటి కీలక విషయంపై వైసీపీకి ఒక స్పష్టత లేదు.
సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో..
అప్పట్లో విశాఖ రాజధాని అని జగన్ అన్నారు. అనంతపురం ప్రజలు విశాఖకు ఎన్ని గంటలు ప్రయాణించాలి?. రాష్ట్రానికి నడిబొడ్డున అమరావతి ఉంది. రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను సర్వనాశనం చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నించారు. ఇప్పటివరకూ మనకు రాజధాని లేదనే బాధ కలచివేస్తుండేది. పొరుగు రాష్ట్రాల ప్రజలు రాజధాని గురించి అడిగితే సమాధానం చెప్పుకోలేని దుస్థితి. ఇప్పటి నుంచి ఆ బాధ లేదు. అమరావతి అద్భుత నగరంగా ఆవిష్కరించబోతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే ఏంటో వైసీపీ నేతలకు మరోసారి తెలుస్తుంది. రాజధాని అమరావతికి ఇప్పటికే 66 జాతీయ సంస్థలు వచ్చాయి. 60కి పైగా హైరేజ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. క్వాంటమ్ వ్యాలీ కూడా వచ్చింది. భవిష్యత్తులో రాష్ట్రమంతా గర్వించేలా అమరావతిని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దడం ఖాయం' అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కారు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు..
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్