Share News

Gandhi Bhavan: యూత్‌ కాంగ్రెస్‌ నేతల బాహాబాహీ

ABN , Publish Date - Jan 23 , 2025 | 03:48 AM

గాంధీభవన్‌లో బుధవారం జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం రసాభాసగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా చీకటి కార్తీక్‌ ఎన్నికపై ఆ జిల్లాకు చెందిన పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది.

Gandhi Bhavan: యూత్‌ కాంగ్రెస్‌ నేతల బాహాబాహీ

  • గాంధీభవన్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): గాంధీభవన్‌లో బుధవారం జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం రసాభాసగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా చీకటి కార్తీక్‌ ఎన్నికపై ఆ జిల్లాకు చెందిన పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. చీకటి కార్తీక్‌కు 40 ఏళ్లు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను అధ్యక్షునిగా ఎలా ఎన్నిక చేశారంటూ సమావేశంలో ఆ నేతలు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికే పదవులు ఇచ్చారని, ముందునుంచీ కాంగ్రె్‌సలో ఉన్న నేతలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి సురభి ద్వివేదీ.. డబ్బులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్ష నియామకం జరిపారని ఆరోపించారు.


ఈ సందర్భంగా కా ర్తీక్‌ వర్గీయులకు, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి మధ్య ఘర్షణ జరిగింది. గాంధీభవన్‌ ఆవరణలో ఇరువర్గాల వారూ బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా కొట్టుకున్నారు. చివరికి పోలీసులు, చుట్టు పక్కల ఉన్న నేతలు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. అయితే గాంధీభవన్‌లో గొడవ జరగడంపై ఆరా తీసిన టీపీసీసీ అధ్యక్షుడు.. ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చాక పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోనున్నారు. ఈ గొడవపై యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి స్పందిస్తూ.. ఎన్నిక నిబంధన ప్రకారమే జరిగిందన్నారు.

Updated Date - Jan 23 , 2025 | 03:48 AM